గిరిజన ప్రాంతాల్లో వ్యాధులపై అప్రమత్తం
అప్రమత్తంగా ఉన్న ఆరోగ్యశాఖ
ఆదిలాబాద్,ఆగస్ట్28 (జనంసాక్షి): వర్షాకాలం వానలకు తోడు సీజన్ మారడంతో అధికారులు గిరిజన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరిపడా మందులు పంపిణీ చేస్తూ గ్రామాల్లో క్రమంగా వైద్య శిబిరాలను నిర్వహిస్తూ అధికారులు వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది, మందులు అందుబాటులో ఉండేలా
కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. పాఠశాలల ప్రారంభానికి ముందుగానే గిరిజన ఆశ్రమ పాఠశాలలు, బీసీ వసతిగృహాలు, ఇతర విద్యాసంస్థల్లో దోమల నివారణకు స్పే చేస్తున్నారు. గ్రామాల్లోని ప్రతి ఇంటికీ వెళ్లి జ్వరాలు సోకిన వారి రక్తనమూనాలు సేకరించి చికిత్సలు అందజేస్తారు. గ్రామాల్లో జ్వరాలు వస్తే ప్రాథమిక స్థాయిలో వైద్యం అందించేందుకు ఆశ కార్యకర్తలకు కిట్లు పంపిణీ చేస్తున్నారు. వీటిలో పారాసిటమల్, క్లోరోఫిన్, ప్రైమాసిన్ మాత్రలతో పాటు రక్తనమూనాలు సేకరించే కిట్ ఉంటుంది. ఫలితంగా ఆశ కార్యకర్తలు గ్రామాల్లో ప్రాథమిక వైద్యం అందించడంలో చురుకైన పాత్ర పోషించనున్నారు. గిరిజన ప్రాంతాల్లో అధికారులు వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టారు. గతంలో జిల్లాలో గిరిజనులకు వివిధ రకాలు వ్యాధులు ప్రాణసంకటంగా మారేవి. డయేరియా, మలేరియా, టైఫాయిడ్, డెంగీ లాంటి వ్యాధులు సోకితే సకాలంలో వైద్యం అందక గిరిజనులు మరణించే వారు. ప్రభుత్వం గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఫలితంగా మూడేళ్లలో ఏజెన్సీలో గిరిజనులు ఆరోగ్యపరమైన ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. ఈ యేడు కూడా అధికారులు ఏజెన్సీ వ్యాధులపై అప్రమత్తమయ్యారు. వైద్యులు, సిబ్బంది వారంపాటు షెడ్యూల్ ప్రకారం క్షేత్రస్థాయిలో మారుమూల గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తారు. వీటితో పాటు ఉట్నూర్, బోథ్‌లో కమ్యూనిటీ దవాఖానలు, ఆదిలాబాద్ రిమ్స్‌లో సైతం గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి. సిబ్బంది పనితీరును పర్యవేక్షించడంతో పాటు వారు విధులను సక్రమంగా నిర్వహించేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బయోమెట్రిక్ యంత్రాలను సైతం అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే గ్రామాల్లో పారిశుధ్య నివారణతో పాటు గిరిజనులకు వ్యాధులు సోకకుండా రక్షిత తాగునీటి సరఫరా, వ్యాధులు ప్రబలిన గ్రామాల్లో వైద్యపరంగా తీసుకోవాల్సిన చర్యలు వివిధ శాఖలు చేపట్టాల్సిన ముందస్తు నివారణ చర్యలను చేపడతారు.