గిరిజన రిజర్వేషన్లు పెంచాలి -ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కోట్యా నాయక్
తొర్రూరు:27 జూన్ (జనంసాక్షి)
జనాభా ప్రాతిపదికన గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచాలని ఎల్ హెచ్ పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భూక్య కోట్యా నాయక్ డిమాండ్ చేశారు.
సోమవారం డివిజన్ కేంద్రంలో ఎల్ హెచ్ పిఎస్ ఆధ్వర్యంలో ఆ సంఘం సాంస్కృతిక విభాగం రాష్ట్ర ఇంచార్జి భూక్య గిరి నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుగులోతు భీమా నాయక్ లతో కలిసి చలో మహబూబాబాద్ కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.మన తండాలో మన రాజ్యం నినాదంతో తండాలు గ్రామ పంచాయతీలుగా సాధించినట్లే మన మెంత మందిమో మనకంత వాటా నినాదంతో 10 శాతం గిరిజన జనాభా ప్రకారం రిజర్వేషన్లు సాధించేందుకు లంబాడీ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ తేజావత్ బెల్లయ్య నాయక్ నాయకత్వంలో ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు.గ్వర్ బొలి భాషను భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో చేర్చాలని, గిరిజనులు దున్ను కుంటున్న పోడు భూములకు పట్టాదారు పాస్ పుస్తకం వెంటనే ఇవ్వాలని, గిరిజనులకు తెలంగాణ రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ జీవోను వెంటనే ప్రకటించి,జీవో నెం.3 వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రతి కొత్త గ్రామ పం చాయతీలకు మౌలిక వసతుల కోసం కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలని, గిరిజన హాస్టళ్లలో మెరుగు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయాలని, బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించాలని, తండాలలో జరిగే అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్లను గిరిజనులకే ఇవ్వాలన్నారు.గిరిజనుల రిజర్వేషన్లు,ఇతర సమస్యలపై జులై 1న మహబూబాబాదులోని యశోద గార్డెన్ లో గోర్ బంజారా జాతీయ సమ్మేళనం, జులై 2న ప్రతినిధుల సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. కావున గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా నాయకులు లకావత్ యాదగిరి నాయక్, మూడ్ సోమాజీ నాయక్, ఎల్ఎస్ఓ జిల్లా అధ్యక్షుడు శివ శర్మ,డివిజన్ అధ్యక్షుడు భూక్యా బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.