గిరిజన రిజర్వేషన్ పెంపు అద్వితీయం
శివ్వంపేట సెప్టెంబర్ 20 జనంసాక్షి :
గిరిపుత్రులకు సీఎం కేసిఆర్ ప్రభుత్వం రిజర్వేషన్ కోటాను 10 శాతం పెంచేందుకు నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని శివ్వంపేట పీఏసీఎస్ చైర్మన్ చింతల వెంకట్రామిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జనాభా లెక్కల ప్రకారం గిరిజనులకు ఇప్పుడున్న రిజర్వేషన్ సరిపోదని,కేంద్ర ప్రభుత్వం గిరిజనుల రిజర్వేషన్ల గురించి పట్టించుకోక పోయినా గానీ గిరిజనులు, ఆదివాసీలకు అన్యాయం జరుగొద్దనే సదుద్దేశ్యంతో సీఎం కేసిఆర్ గిరిజనులకు రిజర్వేషన్ కోటా పెంపు నిర్ణయం ప్రకటించడం జరిగిందని ఆయన అన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు తాండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి, తాండాలకు కూడా ప్రత్యేక నిధులు కేటాయించి వాటి ద్వారా ప్రతి తాండాలో సీసీ రోడ్లు నిర్మించి వాటి అభివృద్ధికి సీఎం కేసిఆర్ ప్రభుత్వం నిత్యం కృషి చేస్తుందని ఆయన అన్నారు. మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనులకు రిజర్వేషన్ కోటా పెంపు పట్ల సీఎం కేసిఆర్ ప్రభుత్వానికి, నర్సాపూర్ ఎమ్మేల్యే మదన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన అన్నారు.