గిరిజన సంక్షేమ శాఖ ప్రకటనపై ఆందోళన

ఆదిలాబాద్‌ ,జూలై 20 : ఐటిడిఎ ఏజెన్సీ ప్రత్యేక డీఎస్సీలో బిఇడి అభ్యర్థులు అర్హులేనని గిరిజన సంక్షేమ శాఖ ఇచ్చిన ప్రకటనపై డిఇడి అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిఇడి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు స్కూల్‌ అసిస్టెంట్‌తోపాటు ఎస్‌జిటి పోస్టులకు కూడా అర్హులేనని ఆ శాఖ ప్రకటించడంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఉందని డిఇడి అభ్యర్థులు అంటున్నారు. ప్రత్యేక డీఎస్సీల్లో జిల్లాకు 251 పోస్టులు మంజూరు కాగా అందులో 194 ఎస్‌జిటి పోస్టులు ఉన్నాయి. ఎస్‌జిటి పోస్టులకు డిఇడి అభ్యర్థులు అర్హులు కాగా ఇందుకు వ్యతిరేకంగా బిఇడి అభ్యర్థులను కూడా అర్హులుగా ప్రకటించడం పట్ల తమకు తీరని అన్యాయం జరుగుతుందని డిఇడి అభ్యర్థులు వాపోతున్నారు. బిఇడి అభ్యర్థులను దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం వల్ల తాము పూర్తిగా నష్టపోతామని వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని డిఇడి అభ్యర్థులు హెచ్చరిస్తున్నారు.