గుజరాత్ ఘటనలపై దద్ధరిళ్లిన పార్లమెంట్
– దళిత యువకులపై దాడికి మండిపడ్డ సభ్యులు
న్యూఢిల్లీ,జులై 20(జనంసాక్షి):గుజరాత్ ఘటనపై రాజ్యసభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు.గుజరాత్ ఘటనపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో రాజ్యసభను బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. బుధవారం విపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతోన్నాయి. గుజరాత్‌లో దళితులపై దాడి ఘటనపై చర్చకు కాంగ్రెస్, బీఎస్పీ పట్టుబట్టాయి. స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్న కాంగ్రెస్, బీఎస్పీ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ ఘటనపై చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు రాజ్యసభలో ఆందోళనకు దిగాయి. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో పది నిమిషాల పాటు సభ వాయిదా పడింది. గుజరాత్ ఘటనపై చర్చించాలని లోక్‌సభలో కాంగ్రెస్, ఆప్ స్పీకర్‌కు నోటీసులు ఇచ్చాయి. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గుజరాత్ ఘటనపై చర్చ చేపట్టాల్సిందేనంటూ విపక్షాలు పట్టుబడటంతో రాజ్యసభ 10 నిమిషాలు వాయిదా పడింది. గుజరాత్ ఊనాలో దళిత యువకులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. జులై 11న గిర్-సోమనాథ్ జిల్లాలోని ఊనాలో నలుగురు దళిత యువకులపై దాడి జరిగింది. ఆవు చర్మం ఒలిచి స్మగ్లింగ్ చేశారన్న ఆరోపణలతో వారిపై క్రూరంగా దాడి చేశారు. ఈ ఘటనపై రాజ్‌నాథ్ లోక్‌సభలో వివరణ ఇచ్చారు. ఈ ఘటనను ప్రధాని మోడీ కూడా ఖండించారని తెలిపారు. దళిత యువకులపై దాడి ఘటనకు సంబంధించి తొమ్మిది మందిని అరెస్టు చేశామన్నారు. ఇందులో ఏడుగురిని రిమాండ్ తరలించగా, మరో ఇద్దరు పోలీసు కస్టడీలో ఉన్నట్లు పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. రెండు నెలల్లోగా ఈ ఘటనపై చార్జీషీట్ దాఖలు చేయాలని ఆదేశించామని తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీని నియమించి పూర్తి స్థాయిలో విచారణ చేపడుతామని స్పష్టం చేశారు. గుజరాత్‌లో ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. దళితులపై వేధింపులు సరికాదన్నారు. గుజరాత్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దళితులపై అనేక దాడులు జరిగాయని గుర్తు చేశారు. తమ పాలనలో అలాంటిదేమి లేదని పేర్కొన్నారు. ¬ంమంత్రి వివరణపై కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పార్లమెంటరీ స్థాయి కమిటీ నియమించాలని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. దళిత యువకులపై జరిగిన దాడిలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ హస్తం ఉన్నట్లు ఆయన ఆరోపించారు. ఇక దళిత యువకులపై జరిగిన దాడిపై చర్చ చేపట్టాలని రాజ్యసభలో విపక్షాలు పట్టుబట్టాయి. రాజ్యసభ ప్రారంభమైనప్పటి నుంచి సభలో వాయిదాల పర్వం కొనసాగింది. రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సభలో కాంగ్రెస్, బీఎస్పీ సభ్యులు నిరసన వ్యక్తం చేసారు.