గుజరాత్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

4brk-guj1ఈబీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను తిరస్కరించిన కోర్టు

అహ్మదాబాద్‌: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం విద్యాసంస్థల్లో, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్‌ కోటాను కల్పిస్తూ గుజరాత్‌ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు తిరస్కరించింది. పటేళ్ల ఆందోళన నేపథ్యంలో రిజర్వేషన్‌ లేని కేటగిరీలలో ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం గత మే లో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6లక్షల కంటే తక్కువ ఉన్న వారికి ఈ రిజర్వేషన్‌ వర్తిస్తుంది. అయితే ఈ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన గుజరాత్‌ హైకోర్టు పది శాతం రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను తిరస్కరించింది.

ఈ ఆర్డినెన్స్‌ వల్ల రిజర్వేషన్‌ లేని వర్గాల వారికి సీట్లు తగ్గిపోతాయని.. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశానికి ఇది వ్యతిరేకమన్న పిటిషన్‌ దారుల వాదనను కోర్టు సమర్థించింది. అయితే ప్రభుత్వం మాత్రం తన వాదనను సమర్థించుకుంది. రిజర్వేషన్లు లేని వర్గాలను మరింతగా వర్గీకరించి ఆర్థికంగా వెనకబడిన వారికి మాత్రమే ఈ రిజర్వేషన్లు వర్తింపచేస్తామని, దీనివల్ల అన్‌రిజర్వ్‌డ్‌ వర్గాలు అవకాశాలు కోల్పోయే ప్రసక్తి లేదని పేర్కొంది.