గుజరాత్‌ ఫలితాలు కనువిప్పు కావాలి : బిజెపిగుజరాత్‌ ఫలితాలు కనువిప్పు కావాలి : బిజెపి

మెదక్‌,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): గుజరాత్‌,హిమాచల్‌ ఫలితాలు అన్ని పార్టీలకు గుణపాఠాలని బిజెపి అధికార ప్రతినిధి రఘునందన్‌ రావు అన్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో భాజపా అధికారంలోకి వచ్చేలా ప్రతి కార్యకర్త పట్టుదలతో పనిచేయాలని అన్నారు. తెలంగాణలో కూడా బిజెపి పాగా వేయడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని అన్నారు.  ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై భాజపా పోరాటం చేయనున్నట్లు పేర్కొన్నారు. బీసీలను అణగదొక్కేందుకే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అంటూ రెండు వర్గాల మధ్య గొడవలు పెట్టేందుకు రాష్ట్రప్రభుత్వం యత్నిస్తోందని  విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజా పోరాటాలని చేపట్టాలని సూచించారు. తెరాస ప్రభుత్వం మతపరమైన రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో 12 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు.  మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, 50 శాతం మించి అమలు చేయరాదని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. ముస్లింలను బీసీల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించడం బీసీలకు అన్యాయం చేయడమే అవుతుందన్నారు. వై.ఎస్‌.ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే కోర్టు కొట్టివేసిందని, ప్రస్తుతం తెరాస ప్రభుత్వం 12 శాతం కల్పిస్తామనడం ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇది ముస్లింలను మభ్యపెట్టడమే అన్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమయంలో నిరంతరం ప్రజల మధ్య ఉండి సమస్యల పరిష్కారం కోసం పని చేయాలని  రఘునందన్‌రావు పిలుపునిచ్చారు.