గుజరాత్‌ సీఎంగా నేడు రూపానీ ప్రమాణం

గాంధీనగర్‌: గుజరాత్‌ నూతన ముఖ్యమంత్రిగా విజయ్‌ రూపానీ ఆదివారం మధ్యాహ్నం 12.40 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 60 ఏళ్ల రూపానీ శనివారం గవర్నర్‌ ఓపీ కోహ్లీని కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. శుక్రవారం రూపానీ భాజపా శాసన సభాపక్షం నేతగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆనందీబెన్‌ పటేల్‌ స్థానంలో రూపానీని ఎన్నుకోవడంలో పార్టీ జాతీయ నాయకత్వం కీలక పాత్ర పోషించింది. గవర్నర్‌ను కలిసిన వారిలో రూపానీ, డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్న నితిన్‌ పటేల్‌, ఇతర రాష్ట్ర నేతలు ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌ రాలేదు. ఆమె తన వారసుడిగా నితిన్‌ పటేల్‌ను చూడాలనుకున్నారు. పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా.. రూపానీ కోసం పట్టుబట్టారు. చివరకు ప్రధాని మోదీ కుదిర్చిన రాజీ సూత్రం ప్రకారం నితిన్‌ పటేల్‌ను ఉప ముఖ్యమంత్రిని చేశారు. రూపానీ, నితిన్‌ పటేల్‌లు ఇద్దరూ శనివారం మాజీ సీఎం కేశూభాయ్‌ పటేల్‌ ఇంటికెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.