గుట్టను కాజేశారు.. రెండు నెలలుగా ఉపాధి లేదు.

పెద్దూరు వడ్డెర కార్మికుల ఆవేదన.

గుట్టను స్పిన్నింగ్ మిల్ భూములను వడ్డెర కార్మికులకే ఇవ్వాలి.

జనశక్తి నేత కూర రాజన్న.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 18.(జనంసాక్షి). సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు ఎల్లమ్మ గుట్టను ఆధారం చేసుకుని ఉపాధి పొందుతున్న తమకు రెండు నెలలుగా ఉపాధి పోయిందంటూ సిరిసిల్ల పెద్దూరు వడ్డెర కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉపాధి కల్పించేల చూడాలని శుక్రవారం ఎల్లమ్మ గుట్ట వద్ద వడ్డెర కార్మికులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఈ సందర్భంగా వడ్డెర కార్మికులు మాట్లాడుతూ ఇటీవల కొందరు ప్రైవేటు వ్యక్తులు తాము స్పిన్నింగ్ మిల్లును కొనుక్కున్నామంటూ గుట్టను చదును చేస్తున్నారని తెలిపారు. ఇదేమని అడిగితే తాము కొనుక్కున్నామంటూ తమను పనులు చేయనివ్వడం లేదని పెద్దూరు వడ్డెర కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు . కొన్ని తరాలుగా తాము ఎల్లమ్మగుట్టని ఆధారం చేసుకుని బతుకుతున్నామని తెలిపారు. గతంలో ఇతర ప్రాంతాల్లో పనులు చేస్తే అక్కడి నుండి వెళ్లగొట్టారని చివరకు ఎల్లమ్మ గుట్టపై ఆధారపడి జీవిస్తుంటే ఇప్పుడు గుట్టను తొలగిస్తున్నారని తమ ఉపాధి లేకపోవడంతో కుటుంబాలు గడవడం కష్టంగా మారిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. స్పిన్నింగ్ మిల్ సర్వే నెంబర్లలో ఎల్లమ్మ గుట్ట లేదని తెలిపారు. ఉపాధి కోసం వడ్డెర కార్మికులు పడుతున్న కష్టాలను తెలుసుకున్న జనశక్తి నేత కూర రాజన్న కార్మికులతో కలిసి మాట్లాడుతూ గతంలో ఇక్కడ ఉన్న భూమి అంతా ప్రభుత్వ భూమెనాని తెలిపారు. ఒక్క సిరిసిల్లలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్ ద్వారా 20 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములను మాయం చేశారని అన్నారు. గుట్టలను ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే ఉపాధి పొందుతున్న వడ్డెర కార్మికులకు ఇవ్వాలి కానీ వేరే వాళ్లకు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. ఎల్లమ్మ గుట్టతోపాటు స్పిన్నింగ్ మిల్ భూములు కూడా వడ్డెర కార్మికులకే చెందుతాయని అన్నారు. వడ్డెర కార్మికులకు ఉపాధి కల్పించాల్సింది పోయి వడ్డెర కార్మికులు ఆధారపడ్డ గుట్ట ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని అన్నారు. వడ్డెర కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెద్దూరు పరిధిలోని వడ్డెర కార్మికులు పాల్గొన్నారు.