గుట్టలుగా చిన్నారుల కంకాళాలు

 పాలా క్రూజ్‌ ప్రాంతంలో తవ్వకాల్లో బయటపడ్డ అస్థిపంజరాలు
600ఏళ్ల నాటివిగా గుర్తింపు
చరిత్రలో అతిపెద్ద నరబలిగా పురావస్తు శాస్త్రవేత్తల వెల్లడి
లిమా, జూన్‌9(జనం సాక్షి ) : చరిత్రలోనే అతిపెద్ద నరబలిని పురావస్తు శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. పెరూకు ఉత్తర ప్రాంతంలో వందల కొద్దీ చిన్నారుల అస్థిపంజరాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. కొలంబియన్‌ పూర్వపు చిమూ నాగరికతకు చెందిన చిన్నారులను పెద్ద మొత్తంలో బలి ఇచ్చినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. తాజాగా 140 మంది చిన్నారుల అస్థిపంజరాలు బయటపడ్డ హువాన్చాకో సవిూపంలోని పంపా లా క్రూజ్‌ ప్రాంతంలో ఈ శవాల దిబ్బ బయటపడటం విశేషం. (అతిపెద్ద బాలల నరబలి) అయితే ప్రస్తుతానికి 56 అస్థిపంజరాలను వెలికీ తీసినప్పటికీ.. ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపేకొద్దీ వందల కొద్దీ అవశేషాలు బయటపడుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లాటిన్‌ అమెరికన్‌ దేశమైన పెరూలో వందల ఏళ్ల క్రితం చిన్నారులను బలి ఇచ్చే సంప్రాదాయం ఉండేది. ప్రస్తుతం లభ్యమైన కంకాళాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. వీరందరినీ దాదాపు ఒకేసారి బలి ఇచ్చి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కార్బన్‌ డేటింగ్‌ పద్దతిలో ఇవి సుమారు 600 ఏళ్ల క్రితం చెందినవిగా నిర్ధారించారు. నేషనల్‌ జియోగ్రఫిక్‌ సొసైటీ ఈ పరిశోధనకు నిధులు సమకూరుస్తుండటం విశేషం.