గురుకులాలన్నీ ఒకే గొడుగు కిందకు

5

– కేజీ టూ పీజీపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 5(జనంసాక్షి):

రాష్ట్రంలోని గురుకుల విద్యా సంస్థలన్నింటినీ ఒకే గొడుకు కిందకు తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. కేజీ టు పీజీ విద్యా విధానంపై విద్యాశాఖ అధికారులతో సచివాలయంలో ఆయన బుధవారం సవిూక్ష నిర్వహించారు. పేద విద్యార్థులకు 12వ తరగతి వరకు ఉచిత విద్యా బోధన అందించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులందరికీ ప్రవేశాలు కల్పించాలని ఆదేశించారు. అన్ని గురుకుల పాఠశాలల్లో ఒకే రకమైన విద్య, వసతి కల్పించాలని, 12వ తరగతి తర్వాత కోర్సులు, విద్య, వసతిపై సమగ్ర విధానం రూపొందించాలని ఆదేశించారు. 4వ తరగతి వరకు తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉండేలా గ్రామస్థాయిలో విద్యాబోధన, తర్వాత ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్య అందించాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో దళిత అమ్మాయిలకు ప్రత్యేక వసతిగృహం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం 668 గురుకుల పాఠశాలలకు తోడు కొత్తగా 522 పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.  అలాగే ప్రతి నియోజకవర్గానికి పది చొప్పున గురుకుల పాఠశాలలు ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 12వ తరగతి వరకు ఉచితంగా విద్యనందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రతి జిల్లాలో మైనారిటీల కోసం ఒక రెసిడెన్షియల్‌ స్కూలు ఏర్పాటు చేయనున్నామన్నారు. అలాగే కేజీ నుంచి కాకుండా నాలుగో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఉచిత విద్య అందిస్తామన్నారు. అలాగే ఉద్యోగ నియామకాలు, ఖాళీలపై కూడా చర్చించారు. చర్చలో డిప్యూటి సిఎం కడియం శ్రీహరి, టిఎస్‌ పిఎససి ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

కాలుష్య నియంత్రణ మండలి సభ్యుల నియామకం కాలుష్య నియంత్రణ మండలిలో స్థానిక సంస్థల ప్రతినిధులు, అనధికారిక సభ్యులను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు అటవీ, పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. స్థానిక సంస్థల కోటా నుంచి కరీంనగర్‌ జడ్పీటీసీ లద్ఘిర్మన్‌ తుల ఉమ, బీబీనగర్‌ ఎంపీపీ ప్రణీత, ఘట్‌కేసర్‌, గుడిహత్నూర్‌, చిర్రకుంట జడ్పీటీసీలు సంజీవరెడ్డి, కేశవరావు, కొయ్యాల ఈమాజీలను సభ్యులుగా నియమించారు. అనధికారిక సభ్యుల కోటాలో పారిశ్రామిక సంక్షేమ సంస్థ ప్రతినిధి ఎస్వీ రఘు, శ్రీని ఫడ్‌పార్క్‌కు చెందిన గడ్డం రాజేందర్‌, పర్యావరణవేత్త కొలను ప్రదీప్‌రెడ్డిలను సభ్యులుగా నియమించారు.