గుర్గావ్ మహిళ ముందుచూపు!

51470379348_625x300గుర్గావ్‌: ఆమె పేరు ఊర్వశీ యాదవ్‌ (45). అమె ఓ స్కూల్‌ టీచర్‌. ఆమె భర్త అమిత్‌ ఓ ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌. మామగారు ఎయిర్‌ఫోర్స్‌ వింగ్‌ కమాండర్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. ఆమెకు గుర్గావ్‌లోని ఓ ప్రాంతంలో రూ.3 కోట్లు విలువ చేసే పెద్ద ఇల్లుంది. అలాగే రెండు పెద్ద కార్లు కూడా ఉన్నాయి. అయితే ఓ చిన్న ప్రమాదం ఆమె ఆలోచనను మార్చేసింది.
ఆమె భర్త అమిత్‌ ఇటీవలె ఓ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతనికి తుంటి ఆపరేషన్‌ చేయాలని, అది చేసినా నడిచే అవకాశాలు మాత్రం తక్కువని డాక్టర్లు చెప్పారు. అయినా వారి జీవనానికి ఎటువంటి ఇబ్బందులూ లేవు. అయితే కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయనే ఉద్దేశ్యంతో ఊర్వశి తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి రోడ్డు పక్కన ఓ చిన్న టిఫిన్‌ బండి పెట్టింది. అలా రోజుకు రూ.2500 నుంచి 3000 వరకు సంపాదిస్తోంది.

‘ప్రస్తుతానికి మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేవు. అయితే భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం. అందుకే ముందు జాగ్రత్తగా ఈ ఏర్పాటు చేసుకున్నా. నా ఇద్దరు పిల్లల్ని మంచి స్కూల్‌లోనే చదివిస్తున్నాం. ఇలా రోడ్డు పక్కన టిఫిన్‌ సెంటర్‌ నడుపుతున్నందుకు మా బంధువులు బాధపడుతున్నారు. నాకెలాంటి ఇబ్బందీ లేదు. ఎందుకంటే నా కుటుంబం కోసం నేను పనిచేస్తున్నా. పైగా వంట చేయడం నా అభిరుచి. దీన్ని వృద్ధి చేసి ఓ పెద్ద రెస్టారెంట్‌ ప్రారంభిస్తాన’ని ఆమె ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.