గుహను గెలవడం ఓ మిరాకిల్
– బాలురను బయటకు తీసుకొచ్చేందుకు ఎంతో శ్రమించాం
– బాలురలను కాపాడిన డ్రైవర్లు
– థాయ్‌లో పెద్ద ఎత్తున సంబరాలు
మేసాయి, జులై11(జనం సాక్షి) : థాయ్‌లాండ్‌లోని ప్రముఖ తామ్ లుయాంగ్ గుహలో చిక్కుకుపోయిన 12 మంది బాలురు, వారి ఫుట్‌బాల్ కోచ్ సురక్షితంగా బయటపడడంతో థాయ్‌లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. వర్షాకాలం అయినందున ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గుహలో నుంచి ఈత రాని చిన్నారులను బయటకు తీసుకురావడం దాదాపు అసాధ్యమని భావించిన తరుణంలో అందరూ సురక్షితంగా బయటకు రావడం చాలా గొప్ప విషయం. ఇక చిన్నారుల తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. వారిని బయటకు తీసుకొచ్చేందకు థాయ్ సహా విదేశాల డైవర్లు ఎంతో శ్రమపడ్డారు. ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించారు. సహాయక చర్యల్లో పాల్గొన్న డైవర్లను ప్రపంచమంతా ప్రశంసిస్తోంది. గుహలో చిన్నారుల జాడ తెలిసిన తర్వాత వారం రోజులకు అన్ని పరిస్థితులను అంచనా వేసి ఇక వారిని ఎలాగోలాగా ఈదుకుంటూనే బయటకు తీసుకురావాలి తప్ప వేరే మార్గం లేదని గుర్తించిన అధికారులు ఆదివారం సహాయక చర్యలు ప్రారంభించారు. మూడు రోజుల్లో విడతల వారీగా మంగళవారం నాటికి అందరినీ బయటకు తీసుకొచ్చారు. ఆదివారం నలుగురు పిల్లల్ని, సోమవారం నలుగురిని, మంగళవారం నలుగురు పిల్లలు, కోచ్‌ను తీసుకొచ్చారు. అందరూ ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఇందుకు డైవర్లు చేసిన కృషి సాధారణమైనది కాదు. ఒక్కోసారి గుహలోకి వెళ్లి రావడానికి డైవర్లకు 9 నుంచి 11 గంటల సమయం పట్టింది. చిమ్మచీకటిలో, ఇరుకైన గుహలో కొన్ని గంటల పాటు ఈదడం మామూలు విషయం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను కాపాడడం అద్భుతంగా భావిస్తున్నారు. ‘ఇది మిరాకిలా, సైన్సా, ఇంకేదైనానా’ తెలియట్లేదు అని థాయ్ నేవీ సీల్ ఒకరు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. చిన్నారులను కాపాడేందుకు తాను తొమ్మిది రోజుల పాటు 63 గంటలు గుహలో గడిపినట్లు ఓ డైవర్ తెలిపారు.
బ్రిటిష్, ఆస్టేల్రియా, చైనా, థాయ్‌లాండ్, అమెరికా, డెన్మార్క్ దేశాలకు చెందిన 18 మంది నిపుణులైన డైవర్ల బృందం చిన్నారులను విడతల వారీగా రక్షించి బయటకు తీసుకొచ్చింది. వీరితో పాటు మరో వంద మంది సిబ్బంది, 1000 మంది థాయ్ సైన్యం సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మరో పదివేల మంది అన్ని రకాలుగా ఈ ఆపరేషన్‌కు సహాయ సహకారాలు అందించారు. కొందరు స్వచ్ఛందంగా సహాయక శిబిరం వద్దకు వచ్చి డైవర్లకు, ఇతర సహాయక సిబ్బందికి, విలేకరులకు ఆహారం అందించారు. ఫైడ్ర్చికెన్, నూడుల్స్ సూప్స్, గుడ్లు, అన్నం తదితర పదార్థాలు ఇచ్చారు. అక్కడి గ్రామస్థులు కొందరు కాఫీ స్టాల్స్, డైవర్ల కోసం మసాజ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ నిపుణులు రెస్క్యూ కమ్యూనికేషన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.