గూఢచర్యంలో షాకింగ్ నిజాలు

న్యూఢిల్లీ: భారత రక్షణ బలగాల గురించి సమాచారం లీక్ చేసి అరెస్టయిన మౌలానా రంజాన్, సుభాష్ జాంగిడ్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం వీరిద్దరు గత పద్దెనిమిది నెలలుగా బీఎస్ఎఫ్ బలగాల నుంచి అత్యంత గోప్యంగా విలువైన సమాచారం సేకరిస్తున్నారంట. అంతేకాదు, వీరి నుంచి తనకు కావాల్సిన సమాచారం కోసం భారత్ లోని పాకిస్థాన్ హైకమిషనర్ కార్యాలయంలోని వీసా సెక్షన్లో విధులు నిర్వర్తిస్తున్న మొహమ్మద్ అక్తర్ ప్రతి నెల కలిసేవాడంట. తనకు ఏ విధమైన వివరాలు కావాలో వారికి నిర్దేశించేవాడంట.

అంతేకాదు, ఒక్కో డాక్యు మెంటు అందించినందుకు రూ.30 వేల నుంచి రూ.50వేల వరకు వారికి చెల్లించడంతోపాటు, ప్రత్యక్షంగా వివరాలు తెలియజేసినందుకు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు చెల్లింపులు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది. అరెస్టయిన వీరిద్దరు కూడా రాజస్థాన్, గుజరాత్లోని భారత సరిహద్దులో ఉన్న బీఎస్ఎఫ్ అధికారులతో సన్నిహితంగా ఉండేవారని కూడా తెలిసింది. అయితే,వారికి కూడా వివరాలు తెలిపినందుకు ముడుపులు ఇచ్చారా లేదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. వీరు చెప్పిన వివరాల ప్రకారం మొత్తం 13మంది బీఎస్ఎఫ్ అధికారులు వీరితో టచ్ లో ఉన్నారని తెలుసుకొని ప్రస్తుతం ఆ అధికారులపై నిఘా ప్రారంభించారు.

త్వరలోనే వారిని కూడా విచారించనున్నట్లు సమాచారం. అరెస్టయిన వారిలో మౌలానా రంజాన్కు బీఎస్ఎఫ్ అధికారులతో చాలా మంచి నెట్ వర్క్ ఉందని పోలీసులు గుర్తించారు. గత నెల రోజులుగా మౌలానాపై నిఘా పెట్టి చూడగా అతడు ఆర్మీ, పారామిలిటరీ నుంచి ఎలాంటి వివరాలనైనా సేకరించగల సంబంధాలు కలిగి ఉన్నాడని గుర్తించినట్లు చెబుతున్నారు. అతడు టచ్లో ఉన్న అధికారుల్లో కొంతమంది తన దూరపు బంధువులు కూడా ఉన్నట్లు తెలిసింది.