గొర్రెల పంపిణీ సక్రమంగా సాగాలి
మెదక్,జూలై1(జనం సాక్షి): గొల్ల కురుమల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకాన్ని సద్వినయోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. అందరూ ఆర్థికంగా ఎదగాలనే ఈ పథకం ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గొర్రెల పంపిణీ పక్రియను వేగవంతం చేస్తున్నారని అన్నారు. రెండో విడత పంపిణీ త్వరలోనే జరుగనుందని అన్నారు. రాష్ట్రంలోని గొల్ల, కురుమ కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రాయితీ గొర్రెల పంపిణీ పథకాన్ని విజయవంతం చేయడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి గొర్రెల పంపిణీ పక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రైతులకు పంపిణీ కోసం కొనుగోలు చేసిన గొర్రెల రవాణాలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఒక వాహనంలో నాలుగు యూనిట్లకు మించి గొర్రెలను సరఫరా చేయొద్దు అని అధికారులకు సూచించారు. ఇదిలావుంటే అర్హులైన దళితులకే ప్రభుత్వం భూ పంపిణీ చేస్తుందని జాయింట్ కలెక్టర్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చే భూములు సాగుకు అనుకూలంగా ఉండాలన్నారు. సాగుకు అనుకూలంగా లేని భూములను దళితులకు ఇవ్వడం కుదరదన్నారు. మంచి భూములనే ఎంపిక చేసి అర్హులైన వారికి కచ్చితంగా ఇస్తామన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆదేశానుసారం భూములను పరిశీలిస్తున్నామని, ఎక్కడైతే భూములు సాగుకు అనుకూలంగా ఉంటాయో అక్కడ భూమిలేని నిరుపేదలను గుర్తించి ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వానికి విక్రయించాలనుకున్న రైతులు వారి భూముల్లో బోరుబావులున్నా వాటి విలువ ప్రకారం ప్రభుత్వం డబ్బులను ఇస్తుందన్నారు. దళితులకు ఇచ్చే భూములను ఇప్పటి వరకు సర్వేలు చేయడం జరుగుతుందని, త్వరలోనే ఎంపికైన దళితులకు భూ పంపిణీ చేస్తామని అన్నారు.