గొర్రెల యూనిట్లకు మేలురకం దాణా పంపిణీ

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి): ప్రభుత్వం సరఫరా చేసిన గొర్రెల యూనిట్లన్నింటికీ మేలురకమైన, పోషక విలువలు, మినరల్స్‌తో కూడిన దాణా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు  పలు గ్రామపంచాయతీల్లో  గొర్రెల దాణా సరఫరా చేసింది. మండల పశువైద్యాధికారుల ఆధ్వర్యంలో ఈ దాణా సరఫరా జరుగుతోంది. ఈ పంపిణీ దాదాపుగా పూర్తికావచ్చింది. అత్యధిక పోశక విలువలున్న ఈ దాణా ప్రతి యూనిట్‌కు రెండు మాసాల వరకు మేతకు వస్తుందని డాక్టర్లు  చెప్పారు. దాణాలో గొర్రెల ఆరోగ్యానికి పనికి వచ్చే మినరల్స్‌, విటమిన్స్‌, ఇతర బలవర్ధక పదార్థాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. రైతులు పరిశుభ్రమైన వాతావరణంలో గొర్రెల పెంపకం చేపడుతూ, ప్రభుత్వం సరఫరా చేసిన దాణాను ప్రణాళికా బద్ధంగా ఉపయోగిస్తే గొర్రెల ఆరోగ్యం మొరుగై, వాటి సంతానోత్పత్తి బాగా జరుగుతుందన్నారు. దాణాను రైతులు దుర్వినియోగం చేయవద్దని, కేవలం గొర్రెల యూనిట్లకే వాడాలని కోరారు.  గొల్లకుర్మలకు 75 శాతం సబ్సిడీతో ఒక్కొకరికీ 20 గొర్రెలు, ఒక పొట్టేల్లను ఇది వరకే పంపిణీ చేశారు. గొర్రెలు ఆరోగ్యకరంగా ఉండాలని, వాటికి మేలురకం సంతానోత్సత్తి జరగాలని తాజాగా ఒక్కో యూనిట్‌కు దాణా సంచులను సరఫరా చేస్తున్నారు. గ్రామపంచాయతీల్లో మొత్తం  గొర్రెల యూనిట్లను గొల్లకుర్మలకు పంపిణి చేశారు. కొన్ని చోట్ల యూనిట్లలో ఒకటి రెండు గొర్రెలు చనిపోవడం, కొన్ని చోట్ల సంతానోత్పత్తి ఇబ్బందిగా మారడంతో ప్రభుత్వం ముందుగా గొర్రెల ఆరోగ్యాన్ని బలోపేతం చేయాలని భావించింది.