గోవధ ఇక నేరం..చట్టానికి పదను పెట్టిన సర్కార్‌

ముంబై,మార్చి3(జ‌నంసాక్షి): గో సంరక్షణకు మహా సర్కార్‌ నడుం బిగించింది. దీనికి సంబంధించి చట్టసవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం వేశారు. దీంతో ఇక గోవులను చంపితే నేరంగా పరిగణిస్తారు.  హిందువుల పవిత్రకు చిహ్నంగా ఉండే ఆవులను వధించడం ఇక నుంచి నాన్‌బెయిలబుల్‌ నేరంగా పరిగణిస్తారు.  ప్రభుత్వం ఇక నుంచి గోవులను వధించి వాటి మాంసాన్ని ఎగుమతి, దిగుమతి చేస్తున్న వారిపై కఠిన శిక్షను విధించనుంది. మహారాష్ట్రలో ఆవుల వధకు సంబంధించిన ఎనిమల్‌ ప్రిజర్వేషన్‌ బిల్లు-1995 లో సవరణకు ఆమోదం లభించింది. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈ బిల్లుకు ఆమోదముద్ర వేశారు. తాజా సవరణ ప్రకారం ఆవులను వధించడం నాన్‌బెయిలబుల్‌ నేరంగా తీసుకోబడుతుంది. ఆవుల వధకు సంబంధించిన అంశంపై బీజేపీ ఎంపీ కీర్తి సోమయ్యతోపాటు మరో ఆరుగురు ఎంపీలు ఎనిమల్‌ ప్రిజర్వేషన్‌ బిల్లుపై సవరణ చేపట్టాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి బిల్లు లో సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎనిమల్‌ ప్రిజర్వేషన్‌ బిల్లు-1995 బీజేపీ-శివసేన సంకీర్ణ ప్రభుత్వ హయాంలో రూపొందించబడింది.