గ్రామపంచాయతీలకు నేరుగా నిధులు వద్దు

5

– ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలవుతున్నారు

– పంచాయతీరాజ్‌ మంత్రి కేటీఆర్‌

న్యూఢిల్లీ,డిసెంబర్‌ 7 (జనంసాక్షి): గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులిచ్చే విధానాన్ని కేంద్రం పునసవిూక్షించుకోవాలని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఇవాళ ఆయన కేంద్ర మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌ను కలిసిన అనంతరం మాట్లాడారు. కేంద్రం గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులిచ్చే విధానాన్ని సవిూక్షించుకోవాలని మంత్రిని కోరామన్నారు. కేంద్ర నిర్ణయం వల్ల ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థ నిర్వీర్యమవుతోందని పేర్కొన్నారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారారని పేర్కొన్నారు. మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థ కుప్ప కూలిపోయిందని అన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఇదే సమస్యను లేవనెత్తుతున్నాయని వాటితోనూ సంప్రదించి ఒకే వేదికపైకి రావాలని కేంద్ర మంత్రి సూచించారని తెలిపారు. మిగిలిన రాష్ట్రాలను ఒకే వేదికపైకి తెచ్చేందుకు చొరవ చూపుతామని తెలిపారు. మిగతా రాష్ట్రాల పంచాయతీరాజ్‌ మంత్రులతో త్వరలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి వెల్లడించారు. రాబోయే బడ్జెట్‌ సమావేశాల కంటే ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సాయం చేస్తామన్నారు.మంత్రిని కలిసిన వారిలో అధికార ప్రతనిధి వేణుగోపాలాచారి,ఎంపి జితేందం రెడ్డి తదితరులు ఉన్నారు.