*గ్రామపంచాయతీలో జరిగిన పనులకు ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించాలి*
కొమిరెడ్డి కరంచంద్ ఆవేదన వ్యక్తం చేశారు
మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 20,
జనంసాక్షి
కోరుట్ల నియోజకవర్గంలోని గ్రామపంచాయతీలు గ్రామాభివృద్ధి కొరకు చేసిన పనులపై బిల్లులు చెల్లించాలని ఆయా గ్రామాల సర్పంచులు గతంలో ప్రభుత్వానికి మొరపెట్టుకోగా అందుకు ప్రభుత్వం.. అవమానకర రీతిలో బీరు సీసాలు విస్కీ బాటిల్లు అమ్ముకొని వచ్చిన ఆదాయంతో గ్రామపంచాయతీలు నిర్వహించుకోవాలని హేళన చేసి మాట్లాడడంతో నేడు గ్రామ సర్పంచులందరిలో నైరాశ్యం నెలకొందని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ యువనేత కొమిరెడ్డి కరంచంద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన నేడు మెట్పల్లి పట్టణంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలలో జరిగిన పనులకు ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించలేక నేడు సర్పంచులు ఆత్మహత్యకు పాల్పడవలసినటువంటి పరిస్థితులు నియోజకవర్గంలో నెలకొన్నాయని కరంచంద్ ఆరోపించారు. ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ గ్రామంలో సర్పంచ్ సుంచు సంతోష్ మృతి ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనేనని దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. కోరుట్ల నియోజకవర్గంలోని గ్రామా పంచాయతీలలో సకాలంలో చెల్లించవలసిన బిల్లులు పెండింగ్లో ఉండడంతో తెచ్చిన అప్పులు గుండెల మీద కుంపటిగా మారి సర్పంచుల పరిస్థితి నేడు దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే అసమర్థత వల్లే బిల్లుల చెల్లింపు ప్రక్రియ ఆటకెక్కిందని పలు గ్రామాలకు చెందిన సర్పంచ్లు ఆరోపిస్తున్నారని కరంచంద్ తెలిపారు. ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న బిల్లులను సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.