గ్రామాల్లో డ్రైనేజీ,సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టాలి
– సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్
మద్దూరు (జనంసాక్షి) ఆగస్టు 14: మద్దూరు మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ అన్నారు. ఆదివారం వారు కార్యకర్తలతో కలిసి మాట్లాడుతూ.. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం లేక వర్షాలకు కాలనీలు అస్తవ్యస్తంగా మారి మురికి నీటితో గుంతల మయంగా మారి చెరువు కుంటలను తలపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారని డెంగ్యూ, మలేరియా జ్వరం వంటి రోగాలకు గురయ్యే ప్రమాదం ఉందని, అధికారులు మాత్రం చూచి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు వెంటనే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు పుల్లని వేణు, సకినాల బాల్ రాజు,మహేష్, పర్శరాములు పాల్గొన్నారు.