గ్రామాల్లో పెత్తనం కోసమే రైతు సమన్వయ సమితులు
మెదక్,సెప్టెంబర్13(జనంసాక్షి): రైతు సమన్వయ సమితుల పేరుతో గ్రామాల్లో పెత్తనం చేయాలన్నదే అధికార టిఆర్‌ఎస్ లక్ష్యంగా కనిపిస్తోందని మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతామని, ఇందుకోసం నిరసనలు నిర్వహిస్తామని ఆమె వెల్లడించారు. రుణమాఫీ, రిజర్వేషన్లు, మూడెకరాల భూమి వంటి మాయమాటలతోనే టీఆర్‌ఎస్ గెలిచింది. ఇప్పుడు అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. రైతు సమన్వయ కమిటీల పేరిట టీఆర్‌ఎస్ కమిటీలను వేస్తోంది. మేం ప్రజలకు, రైతులకు న్యాయం చేసేలా పోరాడుతాం అని ప్రకటించారు. పంట వేసిన ప్రతీ రైతుకు రూ.4 వేల చొప్పున ఇవ్వాలి. లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభలోనే జరగాలని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ రైతు కమిటీలపై పోరాడుతామని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేలు భృతి ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికే మల్లన్నసాగర్ పేరుతో అరాచకం సృష్టించారని, రైతులను వేదఙంపులకు గురి చేశారని అన్నారు. వేములఘాట్ గ్రామంలో ఎకరాకు ఆరు లక్షలిచ్చి వెళ్లిపొమ్మంటే రైతులు ఎక్కడికి పోవాలన్నారు. ఇల్లూ,గొడ్డూగోదా వదులకుని ఎక్కడికి పోతారని అన్నారు. గ్రామసభలు నిర్వహించకుండా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ భూసేకరణ చేయడమేంటన్నారు. ప్రభుత్వానికి ప్రజలపై ఉన్న అభిప్రాయం బయటపడిందని ఎద్దేవాచేశారు.
మల్లన్నసాగర్ భూనిర్వాసితుల విషయంలో అధికారపార్టీ న్యాయస్థానాన్ని సైతం తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తోందన్నారు.