గ్రామాల్లో విజృంభిస్తున్న విషజ్వరాలువైద్యసేవలు అందక అవస్థలు

నెల్లూరు,నవంబర్‌11జనం సాక్షి): వర్షాలతో గ్రామాల్లోని అంతర్గత రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయి. ఏ గ్రామానికి వెళ్లినప్పటికీ పారిశుధ్య లోపం కనిపిస్తోంది. దాంతో విషజ్వరాలు వణికిస్తున్నాయి. జ్వరాలు సోకిన వ్యాధిగ్రస్తులకు వైద్యం అందించే వారు లేక ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో విషజ్వరాలు ప్రతి గ్రామంలో విజృంభిస్తున్నాయి. ఏఎన్‌ఎంలు ఉండకపోవడంతో వైద్యసేవలు అందడం లేదనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గ్రామాల్లో ప్రధానంగా పారిశుధ్య లోపంతోనే జ్వరాలు ప్రబలుతున్నాయి. పారిశుధ్య పనులు, ఫాగింగ్‌ చేసిన సందర్భాలు కనిపించడం లేదు. దీనిని బట్టి వైద్యసిబ్బంది ఏ మేరకు విధులు నిర్వహిస్తున్నారో అర్థమవుతుంది. అంతేకాకుండా గ్రామాల్లోని చేతిపంపులు, కొళాయిల వద్ద నీరు నిల్వ ఉండడంతో దోమల లార్వా పెరుగుతోంది. గ్రామాల్లో సరైన వైద్యసేవలు అందకపోవడంతో ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. వైద్యసేవలు అందకపోవడంతో ఆర్‌ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తున్నాం. వెంటనే గ్రామానికి వచ్చి వైద్య సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.