గ్రామాల అభివృద్ది లక్ష్యంగా ప్రణాళికలు

అభివృద్దిని అడ్డుకోవడమే విపక్షాల పని: ఎమ్మెల్యే
మెదక్‌, సెప్టెంబర్‌ 6 (జనం సాక్షి ) :   ప్రభుత్వం ఏ పనిచేపట్టినా అడ్డుకోవడమే కాంగ్రెస్‌,టిడిపిలు లక్ష్యంగా పెట్టుకున్నాయని ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి  అన్నారు. ఆనాడు తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్న నేతలు ఇవాళ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని అన్నారు. వీరికి ప్రజల సంక్షేమం కన్నా తమ రాజకీయం ముఖ్యమయ్యిందని మండిపడ్డారు. గ్రామాలు పచ్చగా ఉంటూ అభివృద్ది సాధించాలన్నలక్ష్యంతో సిఎం కెసిఆర్‌ ప్రణాళిక రచించారని అన్నారు. ఏ గ్రామానికి ఆ గ్రామం ఇందులో భాగస్వామ్యం అవుతోందన్నారు. సర్పంచ్‌లు తమ సత్తా చాటి గ్రామాలను అభివృద్ది చేసుకోవాలన్నారు. పదేళ్ల కాలంలో ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన నేతలు ఇవాళ తెలంగాణ అభివృద్దినే అడ్డుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు అభివృద్ధి అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆరోపించారు. కేసీఆర్‌కు మంచిపేరు వస్తోందన్న అక్కసుతోనే ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు.  గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నా.. 10ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నాయకులు ప్రాజెక్టుల నిర్మాణాల ఒప్పందం కుదుర్చుకోకుండా తమపై విమర్శలు చేయడం సరికాదన్నారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు పూర్తయితే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మెదక్‌ జిల్లాకు 10లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. మల్లన్నసాగర్‌ పంట కాల్వల నిర్మాణానికి రైతులు భూములిచ్చి సహకరించాలన్నారు. అధికారులు అంకితభావంతో పని చేయాలన్నారు.