గ్రామ సమస్యలను పరిష్కరిస్తాం
– సోషల్ విూడియాలో వందంతులను ప్రజలు నమ్మవద్దు
– తప్పుడు సందేశాలను పంపించే వారిపై కఠిన చర్యలు తప్పవు
– సీపీ మహేశ్ భగవత్
– పోలీస్ దత్తత గ్రామంలో రహదారిని ప్రారంభించిన మంత్రి జగదీశ్వర్‌రెడ్డి
– తెలంగాణ పోలీస్‌శాఖ దేశానికే ఆదర్శం అన్న మంత్రి
యాదాద్రి భువనగిరి, మే29(జనం సాక్షి): మార్చి 22న అటవీశాఖ సహకారంతో ఐదు కిలోవిూటర్ల రహదారి నిర్మాణాన్ని మొదలుపెట్టామని రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ తెలిపారు. రాచకొండ పరిధిలో పోలీసుల దత్తత గ్రామంలో రక్షక బాట పేరుతో కడిలబావితండా నుంచి అయిదుదోవల తండా వరకు 5 కిలో విూటర్ల మేర నిర్మించిన రహదారిని మంత్రి జగదీశ్‌రెడ్డి, సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..అతి తక్కువ సమయంలో నాణ్యతలో రహదారిని నిర్మించామన్నారు. జనవరి 23 న ఇక్కడ బీఎస్‌ఎన్‌ఎల్ సెల్‌టవర్ ఏర్పాటు చేశామన్నారు. గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు రోడ్డు, బస్సు సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. ముందుగా సైబరాబాద్ తూర్పు కమిషనరేట్ అని పేరు పెట్టారని, స్థానిక ఎమ్మెలే చొరవతో సీఎం కేసీఆర్ రాచకొండగా మార్చారని సీపీ భగవత్ పేర్కొన్నారు. అధికారుల సలహాతో రాచకొండ గ్రామాన్ని దత్తత తీసుకున్నానని, గ్రామంలోని సమస్యలను అధికారులు తప్పకుండా పరిష్కరిస్తారన్నారు. ఓ మంత్రి ఈ గ్రామానికి తొలిసారి రావడం విశేషమన్నారు. భవిష్యత్తులో ఈ రోడ్డును పక్కా బీటీ రోడ్డుగా చేసేందుకు కృషి చేస్తామన్నారు. సోషల్‌విూడియాలో వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. అనుమానం కలిగితే డయల్ 100కు ఫోన్ చేయాలని, తప్పుడు సందేశాలను పంపేవారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. త్వరలో 18వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు చెప్పారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీస్‌శాఖ పటిష్ఠంగా పనిచేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో దేశానికే ఆదర్శంగా పోలీస్‌శాఖ నిలుస్తుందని కొనియాడారు. ఈకార్యక్రమంలో స్థానిక నేతలు, పోలీస్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.