గ్రావిూణ రోడ్లకు మహర్దశ
నిర్మాణాలకు నిధుల రాకతో కనిపిస్తోన్న మార్పు
నల్లగొండ,జూలై21(జనం సాక్షి): గత పాలకుల హయాంలో గిరిజన తండాల రహదారులు పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యాయి. కనీసం మట్టి రోడ్లు సైతం మరమ్మతులకు నోచలేదు. నిధుల లేమితో నిర్వహణ సైతం లేక తండాలకు వెళ్లే దారులు అస్తవ్యస్తంగా మారాయి. వర్షాలకు రోడ్లు గతుకులమయమై రాకపోకలకు సైతం వీలులేకుండా ఉన్నాయి. అత్యవసర వైద్య సేవల సందర్భంలో సమయానికి వైద్యం అందక గిరిజనులెందరో మృత్యువాతపడుతున్న ఉదంతాలెన్నో తండాల్లో చోటుచేసుకుంటున్నాయి. సమస్యను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తండాలకు వెళ్లే రహదారుల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించారు. ఆ మేరకు బీటీ రోడ్ల ఏర్పాటుకు దండిగా నిధులు మంజూరుచేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మిర్యాలగూడ, మునుగోడు, నాగార్జునసాగర్, నల్లగొండ, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు ప్రభుత్వం ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను మంజూరు చేసింది. ఆయా నియోజకవర్గాల పరిధిలో 40 రోడ్లను బీటీలుగా అభివృద్ధి చేయనుండగా ఉమ్మడి జిల్లాలో 84.3కి.విూ. మేర మట్టి రోడ్లు బీటీగా మారనున్నాయి. అత్యధికంగా గిరిజన తండాలు ఉన్న దేవరకొండ నియోజకవర్గానికి ప్రభుత్వం సబ్‌ప్లాన్ నిధుల కేటాయింపులో ప్రాధాన్యతనిచ్చింది. ఇంతకాలం రోడ్లు లేకపోవడంతో తండాల నుంచి మండల కేంద్రాలకు, అటు నుంచి జిల్లా కేంద్రాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే గిరిజనానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎస్టీల సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. అన్ని రకాలుగా వెనుకబడిన గిరిజనులు ఇతర వర్గాలతో సమానంగా రాణించేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతున్నారు. సమైక్య పాలనలనో కనీసం మట్టి రోడ్లకు సైతం నోచని తండాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం బీటీ శోభను తీసుకురావడం హర్షించదగిన విషయం అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.