గ్రూపు-4 పరీక్షలకు సర్వం సిద్ధం

హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి): గ్రూపు-4 పరీక్షలకు సర్వం సిద్ధమని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రిజ్వి తెలిపారు. జిల్లాలో మొత్తం 59వేలమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. శనివారం ఉదయం 9 గంటల వరకు వారు తమ హాల్‌ టిక్కెట్లను ఇంటర్‌నెట్‌ ద్వారా డౌన్‌ లోడు చేసుకోవచ్చని తెలిపారు. జిల్లాలో మొత్తం 157 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పరీక్ష శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై 12.30 గంటలతో ముగుస్తుందన్నారు. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.30 గంటలకు ముగుస్తుందని చెప్పారు. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.పరీక్షకు పది నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతివ్వబోమని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్సు దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. పరీక్ష పూర్తయ్యేంత వరకు అభ్యర్థులు బయటకు రాకూడదన్నారు. సెల్‌ఫోన్లకు అనుమతి లేదన్నారు. పరీక్షను బ్లాక్‌ లేదా బ్లూ ఇంక్‌ బాల్‌పెన్నునే వాడాలని కోరారు. మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మొత్తం 2629 పరీక్షా కేంద్రాలు..
రాష్ట్ర వ్యాప్తంగా గ్రూపు-4 పరీక్ష కోసం మొత్తం 2,629 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని ఎపిపిఎస్‌సి అధికారులు తెలిపారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 9 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అభ్యర్థుల కోసం ఆర్టీసి సంస్థ ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు తెలిపారు. ఒక జిల్లాలో వేరే జిల్లా వారు పరీక్ష రాస్తే అట్టి వారు తప్పనిసరిగా ఆన్సర్‌ షీటుపై తమ జిల్లా పేరును నమోదు చేయాలని సూచించారు.