గ్రేటర్ వరాలు
– నీటి విద్యుత్ బిల్లుల రద్దు
– సీఎం కేసీఆర్ నిర్ణయం
హైదరాబాద్,డిసెంబర్3(జనంసాక్షి): గ్రేటర్ ప్రజలకు తెలంగాణ సర్కార్ మరో వరం ఇవ్వనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యుత్, నల్లా బకాయిలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. రూ.128 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు, రూ. 295 కోట్లకు పైగా నల్లా బిల్లులను మాపీ చేసే యోచనలో సర్కారు ఉన్నట్టు తెలిసింది. అయితే ఇందులో నిరుపేదలు సహా అందరికీ వర్తించేలా రద్దు నిర్ణయాన్ని త్వరలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. విద్యుత్ బకాయిలు, నల్లనీటి బిల్లుల బకాయిలపై మంత్రులు తలసాని, పద్మారావు, జల మండలి అధికారులతో ఆయన సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యుత్, నీటి బకాయిలు రద్దు చేయాలని నిర్ణయించారు. 6 లక్షల గృహాల విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.128 కోట్లు, రూ.290 కోట్ల మంచినీటి బకాయిలు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఉత్తర్వులు జారీ చేయలేమని సీఎం తెలిపారు. ఎన్నికల కోడ్ ముగియగానే ఉత్తర్వులు విడుదల చేస్తామన్నారు.