ఘనంగా గణనాథుల నిమజ్జనం

 

గౌరీ సుతుడు కి ….. ఘన వీడ్కోలు

గంగమ్మ ఒడికి. ……. గణనాథులు

మానకొండూరు, సెప్టెంబరు 9( జనం సాక్షి)

నవరాత్రుల పాటు ఘనమైన పూజలందుకున్న గౌరీ సుతుడు కి జిల్లా వాసులు శుక్రవారం ఘన వీడ్కోలు పలికారు. పోయి రా గణపయ్య పోయి రావయ్యా అంటూ సాగనంపారు. శుక్రవారం ఉదయం నుండి విశేష పూజలు చేసి సాయంత్రానికి నిమజ్జనానికి భక్తులు, మండపాల నిర్వాహకులు అత్యంత భక్తి శ్రద్ధలతో విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. వినాయక ప్రతిమలను తరలించే వాహనాలను రంగు,రంగుల పూలతో, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రతిమలను తరలించే వాహనశ్రేణి ముందు గణపతి మొప్ప మోరియా, గణేష్ మహారాజ్ కి జై అంటూ భక్తులు భక్తులు నినాదాలతో హోరెత్తించారు. కరీంనగర్ నుండి భారీ వినాయక విగ్రహాలను మానకొండూరు కు తరలించే క్రమంలో సాగిన గణనాథుని శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమం కన్నులపండువగా కొనసాగింది. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ , తెరాస పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణ రావు, లు నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జడ్పిటిసి తాళ్ళపల్లి శేఖర్ గౌడ్ , స్థానిక సర్పంచ్ పృథ్వీరాజ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎంపీడీవో దివ్య దర్శన్ రావు, తహశీల్దార్ లక్ష్మారెడ్డిలు ఆయన వెంట ఉన్నారు. నృత్యాలు, వాయిద్యాలు, భక్తి గీతాల ఆలాపన తో భక్తులు పారవశ్యంలో మునిగి పోయారు. సుమారు గంట సేపు కురిసిన భారీ వర్షంతో, భక్తులు, అధికారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. గణనాథుని ప్రతిమలు తరలించే క్రమంలో వర్షంతో తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో నిమజ్జన కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభమైంది.

*. నిమజ్జన, గణపయ్య శోభాయాత్ర కు భారీ ఏర్పాట్లు

 

వినాయక విగ్రహాలను మూడు ప్రాంతాల్లో నిమజ్జనం చేసేందుకు అధికారులు, బల్దియా పాలకవర్గం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. సాధారణ వినాయక ప్రతిమలను చింతకుంట కాలువలో, చిన్న విగ్రహాలను కొత్తపల్లి చెరువు లో, భారీ విగ్రహాలను మానకొండూరు పెద్ద చెరువులో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశా రు. చింతకుంట మానకొండూరు, చెరువు వద్ద లైటింగ్ టవర్లను సిద్ధం చేశారు. కొత్తపల్లి చెరువు వద్ద రెండు టవర్లు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. నిమజ్జనం వేగంగా, సులువుగా సాగేందుకు పదకొండు భారీ క్రేన్లను వినియోగించారు.

**. పట్టణంలో స్వాగత వేదికలు
కరీంనగర్ లో శోభాయాత్ర కు టవర్ సర్కిల్, రామ్ నగర్ చౌరస్తా వద్ద స్వాగత వేదికలు, భక్తులకు మంచినీటి సదుపాయం తోపాటు, లైటింగ్ ,సౌండ్ సిస్టం ఏర్పాటు, చేశారు. నిమజ్జన సమయంలో వాహనాలు సాఫీగా వెళ్ళటానికి రోడ్లపై గుంతలను పూడ్చారు. టవర్ సర్కిల్, కమాన్, రాంపూర్ మీదుగా మానకొండూరు లోని చెరువు వరకు లైటింగ్ ఏర్పాటు చేశారు. శోభాయాత్రను వీక్షించేందుకు వచ్చే భక్తులకు మంచినీటి సదుపాయం కల్పించారు. నిమజ్జన పాయింట్లలో బారికేడ్ల ఏర్పాటు, లైటింగ్ తో పాటు రెండు పెద్ద క్రేన్లు, ఒక చిన్న క్రేన్ ను వినియోగించారు. గజ ఈతగాళ్లును మూడు షిఫ్టులు వినియోగించ తో పాటు, మెడికల్ క్యాంపు ల లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లు,బ్లీచింగ్ పౌడర్ మందులను అందుబాటులో ఉంచారు. అత్యవసర వేళల్లో విద్యుత్ సౌకర్యం కోసం జనరేటర్లను ఏర్పాటు చేశారు. విద్యుత్ సమస్యలు ఏమైనా ఉంటే హెల్ప్ హెల్ప్ లైన్ నెంబరు 9440811444, టోల్ ఫ్రీ 1912 నంబర్లకు తెలియజేయాలని, విద్యుత్ అధికారులు కోరారు. నిమజ్జన కేంద్రాల వద్ద డి ఈ లు, ఎ డి ఈ లు, ఏఈలు, ఆపరేషన్, మెయింటెనెన్స్ సిబ్బంది శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించారు.

*** దారి మళ్లింపు చర్య లు

కరీంనగర్ _ వరంగల్ కు వెళ్లే వాహనాలను యధావిధిగా అనుమతించగా, వరంగల్ నుండి కరీంనగర్ కు వెళ్లే వాహనాలను మానకొండూరు, ముంజంపల్లి, పోరండ్ల మీదుగా తిమ్మాపూర్ నుండి కరీంనగర్ కు చేరుకునేలా పోలీసులు దారి మళ్లింపు చర్యలు చేపట్టారు.
*. *. పోలీసుల పటిష్ట బందోబస్తు

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా2,789, కరీంనగర్ పట్టణంలో సుమారు 900ల గణేష్ ప్రతిమలు ఉన్నట్లు సమాచారం. లంబోదరుని నిమజ్జన శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు, పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మానకొండూరు, కొత్తపల్లి చెరువు, చింతకుంట కాలువ వద్ద550 మంది పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా తక్షణం అప్రమత్తం అయ్యేలా నిఘా కెమెరాల ను ఏర్పాటు చేశారు. ఇద్దరు అదనపు డీసీపీ ల పర్యవేక్షణలో ఏ సీ పీ లు ఏడుగురు,19 మంది సిఐలు, ఎస్ ఐ లు 40 మంది, ఏ ఎస్సైలు హెడ్ కానిస్టేబుళ్లు 150 మంది, కానిస్టేబుళ్ళు200, మహిళా కానిస్టేబుళ్లు36, హోంగార్డులు100 మంది, సుమారు300 మంది వాలంటీర్లు బందోబస్తు విధులు నిర్వహించారు. అంతకుముందు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, సి పి సత్యనారాయణ ఇతర అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినట్లు సమాచారం లేదు. ఆది దేవుని నిమజ్జనం శనివారం ఉదయం వరకు కొనసాగుతూనే ఉంది.