ఘనంగా గురునానక్ జయంతి వేడుకలు
శోభాయాత్రను ప్రారంభించిన కెటిఆర్
హైదరాబాద్,సెప్టెంబర్5 (జనం సాక్షి ) : సిక్కుల మత గురువు గురునానక్ జయంతి వేడుకల్లో భాగంగా ప్రకాష్ ప్రభ్ యాత్ర నిర్వహించారు. అవిూర్‌పేటలోని గురుద్వారాలో గురునానక్ ప్రకాష్ ప్రభ్ యాత్ర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ యాత్రకు హాజరయ్యారు. యాత్ర ప్రారంభం కంటే ముందు నిర్వహించిన గురునానక్ ప్రకాష్ యాత్రలో భాగంగా జరిగే ‘నగర కీర్తన్’ కార్యక్రమంలో కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అనంతయం ప్రకాష్ ప్రభ్ యాత్రను కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున సిక్కులు పాల్గొన్నారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో గురువారం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఖైరతాబాద్ నుంచి కూకట్ పల్లి వరకు ట్రాఫిక్ జామ్ కావడంతో కిలోవిూటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడం కోసం భక్తులు భారీగా తరలి రావడంతో పాటు అవిూర్ పేట నుంచి గౌలిగూడ వరకు గురునానక్ రథయాత్ర నిర్వహిస్తుండడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. వాహనాలను ఎస్‌ఆర్ నగర్ నుంచి పంజాగుట్ట విూదకు దారి మళ్లించారు.