ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు
ఇబ్రహీంపట్నంలో విద్యార్థులతో భారీ ర్యాలీ
సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం హర్షణీయం: ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసా క్షి):- తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో శుక్రవారం వేలాది మంది విద్యార్థినీ విద్యార్థులు జాతీయ జెండాలను చేతబూని భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులతో కలిసి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై విద్యార్థినులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టడం హర్షణీయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. భారతీయులంతా ఒక్కటే అనే నినాదంతో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను కన్నుల పండువగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి మండలం నుండి విద్యార్థినీ విద్యార్థినులతో పాటు వివిధ శాఖల అధికారులు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగిందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డిఓ వెంకటాచారి, ఇబ్రహీంపట్నం ఏసిపి ఉమామహేశ్వరరావు,జిల్లా రైతు బందు అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, వివిధ మండలాల ఎంపిపి లు జడ్పీటీసీ లు వివిధ శాఖల అధికారులు, ప్రతినిధులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
3 Attachments • Scanned by Gmail