చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై శ్రీలక్ష్మి విడుదల

హైదరాబాద్, అక్టోబర్‌ 9(జనంసాక్షి):  ఓఎంసీ కేసులో అరెస్టై జైల్లో ఉన్న మాజీ ఐఎఎస్‌ అధికారి శ్రీలక్ష్మి మంగళవారం విడుదలయ్యారు. చికిత్స నిమిత్తం కోర్టు శ్రీలక్ష్మికి సోమవారం తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. ఐపిఎస్‌ అధికారి అయిన ఆమె భర్త గోపికృష్ణ బెయిల్‌ పత్రాలను జైలు అధికారులకు అందజేశారు. గతంలో సిబిఐ కోర్టు శ్రీలక్ష్మికి బెయిల్‌ ఇచ్చినప్పటికీ హైకోర్టు ఆ బెయిల్‌ను రద్దు చేసింది. దీంతో శ్రీలక్ష్మి మళ్ళీ జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతవారం తాను నడవలేని స్థితిలో ఉన్నానని, తన ఆరోగ్యం దృష్ట్యా బెయిల్‌ మంజూరు చేయాలని శ్రీలక్ష్మి కోర్టును అభ్యర్ధించింది. శ్రీలక్ష్మి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు సోమవారం బెయిల్‌ మంజూరు చేసింది. సోమవారం నుంచి వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకు ఆమెకు బెయిల్‌ ఇచ్చింది. 20వ తేదీ తర్వాత ఆమె తిరిగి లొంగిపోవాల్సి ఉంటుంది. బెయిల్‌ ఇస్తూ శ్రీలక్ష్మికి షరతులు విధించింది. పాస్‌పోర్టును తమ ముందు పెట్టాలని, బెయిల్‌ సమయంలో ఎవరితోనూ మాట్లాడకూడదని, హైదరాబాద్‌ విడిచి వెళ్లరాదని కోర్టు ఆదేశించింది.వెన్నునొప్పితో బాధపడుతున్న శ్రీలక్ష్మికి శస్త్రచికిత్స అవసరమని చెప్పడానికి ఆమె తరఫు న్యాయవాదులు వైద్య పరీక్షల నివేదికలను కోర్టుకు సమర్పించారు. శ్రీలక్ష్మి తీవ్రమైన మానసికవ్యధతో నలిగిపోతున్నారని, అందువల్ల జైలులో ఉంటూ శస్త్రచికిత్స చేయించుకుంటే శస్త్రచికిత్స ఫలితం ఉండకపోవచ్చునని, బెయిల్‌ ఇస్తే కాస్తా మానసికంగా ఊరట చెందుతుందని, దానివల్ల శస్త్రచికిత్స ఫలితం ఇస్తుందని వైద్యులు ఇచ్చిన వివరణను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది.