చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది
ప్రయోజనంలేని నవనిర్మాణ దీక్షలతో పాలన స్తంభించింది
నవ నిర్మాణ దీక్షలతో రూ.50కోట్లు వృథా చేశారు
బీజేపీ నేతలపై దాడులకు నిరసనగా 11న విజయవాడలో ధర్నా
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు
విశాఖపట్నం, జూన్8(జనం సాక్షి) : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్‌లకు ఓటమి భయం పట్టుకుందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏ ప్రయోజనం లేని నవనిర్మాణ దీక్షల కారణంగా ఏపీలో వారం రోజులుగా ప్రభుత్వ పాలన నిలిచిపోయిందన్నారు. నిర్మాణ దీక్షల వల్ల ఉద్యోగులు కార్యాలయాల్లో ఉండకపోవడంతో ప్రజా సమస్యలు పట్టించుకునే నాథుడే కనిపించడం లేదన్నారు. నవ నిర్మాణ దీక్షల పేరు చెప్పి చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నవనిర్మాణ దీక్షలకు రూ.50 కోట్లు వృథా చేశారని ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌లు భయపడుతున్నారేమో గానీ, బీజేపీకి ఎలాంటి భయాలు లేవని స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలు ఉన్న కాంగ్రెస్ పార్టీతో కలవాలని చంద్రబాబు ఎందుకు అనుకుంటున్నారో చెప్పాలన్నారు. నిత్యం ప్రధాని పదవిని వదులుకున్నానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబును ప్రధానిని చేస్తానని ఎవరు చెప్పారని ఈ సందర్భంగా ఏపీ సీఎంను ఆయన ప్రశ్నించారు. కొడుకును ముఖ్యమంత్రి చేసి.. తాను ప్రధాని కావాలని చంద్రబాబు అనుకుంటున్నారని ఆరోపించారు. 2014లో భాజపా, జనసేన పార్టీల వల్లే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. రాష్ట్రంలో భాజపా గెలుపునకు తెదేపా ఎన్నడూ సహకరించలేదన్నారు. చంద్రబాబు లాంటి కుట్రపూరిత మనస్తత్వం ఉన్న నాయకుడు దేశంలో ఇంకెవరూ లేరని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో భాజపా అభివృద్ధి చూసి ఓర్వలేకే తెదేపా నేతలు తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని వీర్రాజు మండిపడ్డారు. జన్మభూమి కమిటీలు చెబితేనే పెన్షన్లు ఇస్తున్నారని, అర్హులకు ఇళ్లు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. తెల్లవారి లేచిన దగ్గరి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నామస్మరణ చేస్తూ బీజేపీకి చంద్రబాబు గౌరవ ప్రచార కార్యదర్శిగా మారారని పేర్కొన్నారు. బీజేపీ నేతలపై దాడులకు నిరసనగా ఈ నెల 11న విజయవాడలో ధర్నా చేపట్టనున్నట్లు సోము వీర్రాజు వెల్లడించారు.