చంద్రబాబు విధానాలతో ఎపికి ప్రమాదం
హైదరాబాద్‌లో చేసిన తప్పులనే అమరావతిలో చేస్తున్నారు
వలసలను ఆపడంలో ప్రభుత్వం విఫలం: పవన్ కళ్యాణ్
శ్రీకాకుళం,మే29(జనం సాక్షి): చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాల కారణంగా మళ్లీ ఆంధ్రపద్రేశ్ ముక్కలయ్యే ప్రమాదం ఉందని జనసేనాని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అభివృద్ధి వికేంద్రీకరించ కుండా కేవలం అమరావతికే పరిమితం చేయడం సరికాదన్నారు. అప్పట్లో హైదరాబాద్‌లో చేసిన తప్పే అమరావతిలోనూ చేస్తున్నారని, పెట్టుబడులన్నీ ఒక్కచోటే పెడుతున్నారని అన్నారు. మరోసారి ఆంధ్రప్రదేశ్ ముక్కలయ్యే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. శ్రీకాకుళం జిల్లా వాసులు చాలా మంది పొట్ట చేత పట్టుకుని కూలీ పనులు చేసుకోవడానికి వలసలు వెళ్లే పరిస్థితిని ప్రభుత్వాలు తీసుకొచ్చాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వీరంతా ఇక్కడే ఉండి బతకలేని విధంగా చేశారని అన్నారు. మంగళవారం శ్రీకాకుళంలోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సభలో స్థానిక కార్యకర్తలతో పవన్ మాట్లాడుతూ.. అవమానాలు అనేవి ఎపి సిఎం చంద్రబాబుకో, గతంలో పాలించిన కాంగ్రెస్ నేతలకో జరగవని వలసలు వెళ్లే వారికి జరుగుతున్నా యని అన్నారు. గతంలో తన వద్దకు వచ్చి చాలా మంది తమ ఇబ్బందులు చెప్పుకునే వారని, సొంత ప్రాంతాన్ని వదిలి వచ్చినందుకు ఎన్నో సమస్యలు ఎదుర్కుంటున్నామని అనే వారని అన్నారు. చంద్రబాబు లాంటి వారు అనుసరిస్తోన్న పాలసీల వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. రాజకీయ జవాబుదారీ తనం లేకుండా పోతోందని విమర్శించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వంటి నిర్లక్ష్యం చేయబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి సమర్థవంతమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సి ఉందని అన్నారు.