చనిపోయిన బాలుడికి వైద్యం
– డబ్బుకోసం వైద్యుల డ్రామా
– మృతుడి కుటుంబీకుల ఆందోళన
మహబూబ్‌నగర్ క్రైం: చనిపోయిన ఆరు నెలల బాలుడి మృతదేహానికి.. వైద్యులు డబ్బుపై ఉన్న ఆశతో వైద్యం అందించారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు..స్థానికులు కథనం ప్రకారం..నవాబ్‌పేట మండలం మరికల్ గ్రామానికి చెందిన వెంకటయ్య, అలివేలు దంపతులకు మూడో సంతానంలో బాబు పుట్టాడు. గురువారం ఉదయం బాబుకు జ్వరం వస్తే పట్టణంలోని ఓ ప్రైవేట్ క్లినిక్‌కు తీసుకువెళ్లారు. అక్కడ పని చేస్తున్న వైద్యులు..నర్సులు తెలిసీ తెలియని వైద్యంతో అధిక డోస్ కలిగిన ఇంజక్షన్స్, సంబంధంలేని సెలైన్లు ఎక్కించారు.
దీంతో బాబు పరిస్థితి విషమంగా మారింది. ఆలస్యంగా తేరుకున్న క్లినిక్ వైద్యులు వారి అంబులెన్స్‌లో తెలంగాణ చౌరస్తాలో ఉన్న మరో ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటికే మృతిచెందిన బాబుకు ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది కాసులకు కక్కుర్తి పడి చికిత్స చేస్తున్నట్లు డ్రామా చేశారు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు.. బంధువులు వైద్యులను నిలదీయడంతో బాబు మృతి చెందాడని చెప్పారు. దీంతో వారు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. సంఘటన స్థలానికి టూటౌన్ సీఐ డీవీపీ రాజు, ఎస్ఐలు రాఘవేందర్, నసర్ చేరుకోని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.