చనిపోయిన భార్యను భుజాన వేసుకొని..

71472097980_625x300భువనేశ్వర్‌: కట్టుకున్న భార్య అర్థంతరంగా కన్ను మూసిందన్న బాధతో పాటు ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువెళ్లడానికీ వాహనం దొరక్కపోవడం ఆ నిరుపేద గిరిజనుడిని నిస్సహాయుణ్ని చేసింది. అర్థాంగికి ఎలాగైనా స్వగ్రామంలోనే అంత్యక్రియలు చేయించాలనే తపనతో, మరో దారి లేక ఆమె శవాన్ని భుజాన వేసుకుని ఎకాఎకి 60 కి.మీ. నడిచి వెళ్లడానికి కంకణం కట్టుకున్నాడు. తన పన్నెండేళ్ల కుమార్తె వెంట వస్తుండగా అలా 10 కి.మీ. నడిచేశాడు. అక్కడ కొందరు పత్రికా విలేకరులు చూసి, స్పందించి సహాయపడడంతో వూరట లభించింది. దానా మాఝీ అనే వ్యక్తి భార్య అమంగ్‌దేవి… ఒడిశాలో భవానీపట్న జిల్లా ప్రభుత్వాసుపత్రిలో క్షయవాధితో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించింది. వారి స్వస్థలం అత్యంత వెనుకబడిన ప్రాంతమైన కలహండి. ప్రభుత్వాసుపత్రుల్లో మరణించినవారి భౌతిక కాయాలను వారి స్వస్థలాలకు చేర్చడానికి ప్రభుత్వం కల్పించిన ‘మహాప్రయాణ’ పథకం కింద సాయం చేయాలని మాఝీ కోరినా ఆసుపత్రి వర్గాలు స్పందించలేదు. సొంతంగా వాహనాన్ని సమకూర్చుకునే స్థోమత లేదని చెప్పినా కరుణించలేదు. చేసేదేమీ లేక ఒక వస్త్రంలో మృతదేహాన్ని చుట్టి 60 కి.మీ. దూరంలో ఉన్న మేల్ఘారా గ్రామానికి కాలినడకన ప్రయాణమయ్యాడు. 10 కి.మీ. అలా వెళ్లాక కొంత మంది స్థానిక విలేకరులు వీరిని చూసి, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి అంబులెన్సు సమకూర్చారు. మిగిలిన 50 కి.మీ. దూరం ప్రయాణించడానికి ఆ వాహనం ఉపయోగపడింది. ఘటన గురించి తెలియగానే అంబులెన్సు ఏర్పాటు చేసినట్లు కలహండి కలెక్టర్‌ డి.బృందా తెలిపారు.