చమురు కంపెనీలకు ఎస్‌బీఐ షాక్‌

 ఇరాన్‌ నుంచి దిగుమతి చేసుకునే చమురుకు చెల్లింపులు చేపట్టబోమని వెల్లడి
న్యూఢిల్లీ, జూన్‌15(జ‌నం సాక్షి ) : దేశీయ చమురు కంపెనీలకు ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌
ఇండియా(ఎస్‌బీఐ) షాకిచ్చింది. మధ్య ప్రాశ్చ్య దేశమైన ఇరాన్‌ నుంచి దిగుమతి చేసుకునే చమురుకు నవంబరు నుంచి చెల్లింపులు చేపట్టబోమని ఆయిల్‌ కంపెనీలకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ్గ/నాన్షియల్‌ హెడ్‌ ఏకే శర్మ శుక్రవారం వెల్లడించారు. దీంతో ఆగస్టు తర్వాత ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులు తగ్గే అవకాశముంది. అయితే దీనిపై ఎస్‌బీఐ ఇంకా స్పందించలేదు. చైనా తర్వాత ఇరాన్‌ నుంచి అత్యధిక చమురు దిగుమతి చేసుకునేది మన దేశమే. ఎస్‌బీఐ, జర్మనీకి చెందిన యూరోపియష్‌-ఇరానీష్‌ హండెల్స్‌బ్యాంక్‌ ఏజీ(ఈఐహెచ్‌) ద్వారా దేశీయ ఆయిల్‌ కంపెనీలు ఇరాన్‌ నుంచి చమురును కొనుగోలు చేస్తుంటాయి. ఈ లావాదేవీలను నవంబరు నుంచి చేయబోమని ఎస్‌బీఐ తాజాగా ఆయిల్‌ కంపెనీలకు చెప్పింది. దీంతో ఇది దిగుమతులపై ప్రభావం చూపే అవకాశముంది. ఇరాన్‌ నుంచి ఆయిల్‌ దిగుమతిని నిలిపివేసుకోవాలనే ఆలోచనలో ఉన్నామని ఇప్పటికే రిలయన్స్‌ ఇండస్టీస్ర్‌ తెలిపింది. మరోవైపు నయారా ఎనర్జీ కూడా ఈ నెల నుంచి ఇరాన్‌ ఆయిల్‌ దిగుమతులను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్‌తో అంతర్జాతీయ అణు ఒప్పందం నుంచి ఇటీవల అమెరికా వైదొలిగిన విషయం తెలిసిందే. అంతేగాక.. ఆ దేశంపై తిరిగి ఆంక్షలు విధించనున్నట్లు అమెరికా తెలిపింది. అయితే ఇరాన్‌ విషయంలో అమెరికా ఆంక్షలను తాము పాటించబోమని దక్షిణాసియా దేశాలు వెల్లడించాయి. కానీ, అమెరికా ఆర్థిక వ్యవస్థతో సంబంధాలున్న కంపెనీలు, బ్యాంకులు మాత్రం ఈ ఆంక్షలను పాటించాల్సి ఉంటుంది. లేదంటే వారు జరిమానాలు కట్టాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎస్‌బీఐ తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.