చమురు ధరలపై జైట్లీ కొత్త భాష్యం

ప్రజలు సరిగా పన్నులు కట్టకపోవడం వల్లనే ఈ దుస్థితి

ఫేస్‌బుక్‌ పోస్టులో వ్యాఖ్య

న్యూఢిల్లీ,జూన్‌18(జ‌నం సాక్షి): చమురు ధరల పెంపుపై కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ కొత్త భాస్యం చెప్పారు. ప్రజలు సక్రమంగా పన్నులు కడితే ఇలా ఎందుకు జరుగుతుందన్నారు. ప్రజలు నిజాయతీగా తమ వాటా పన్నులు చెల్లిస్తే ప్రభుత్వం ఆదాయం కోసం చమురుపై ఆధారపడే పరిస్థితి ఉండదని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. దీంతోపాటు చమురుపై ఎటువంటి పన్ను కోతలు ఉండబోవని ఆయన తేల్చి చెప్పారు. ఇటువంటి చర్యలు వ్యతిరేక ఫలితాలను ఇస్తాయన్నారు. కేవలం వేతన జీవులు మాత్రమే పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నారని జైట్లీ పేర్కొన్నారు. మిగిలిన వర్గాలు కూడా పన్నుల చెల్లింపును మెరుగుపర్చుకోవాలని కోరారు. నేను రాజకీయ నాయకులు, విశ్లేషకులకు ఒక విషయం విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంధనేతర రంగాల్లో పన్నుల ఎగవేతను ఆపాలని కోరుతున్నాను. ప్రజలు కనుక అన్నిరకాల పన్నులు సక్రమంగా చెల్లిస్తే చమురుపై విధించే పన్నులు తగ్గుముఖం పడతాయి. అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెట్టారు. 2017-18 జీడీపీలో చమురేతర రంగం నుంచి వచ్చిన పన్నుల వాటా 9.8శాతంగా ఉందని జైట్లీ పేర్కొన్నారు. 2007-08 తర్వాత ఇదే అత్యధికమన్నారు. దీంతోపాటు ఇంధనంపై రాష్టాల్రు విధిస్తున్న పన్నులను తప్పుపట్టారు. వినియోగదారులు ఆర్థికంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే చమురు ధరల్లో ఉపశమనం లభిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థికంగా బలపడుతుందని పేర్కొన్నారు. రాష్టాల్రు అదనంగా విధించే పన్నుల కారణంగానే చమురు ధరలు అసాధారణంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం మాట్లాడుతూ కేంద్రం తలుచుకుంటే చమురు ధరను రూ.25 తగ్గించవచ్చుని పేర్కొన్నారు. అయితే చిదంబరం వ్యాఖ్యాలు పూర్తిగా మోసపూరితమైనవని జైట్లీ విమర్శించారు.