చ‌రిత్ర సృష్టించిన ఇస్రో.. విజ‌య‌వంతంగా క‌క్ష్య‌లోకి ఆదిత్య ఎల్‌1

 తిరుపతి: సూర్యుడిపై పరిశోధనలే లక్ష్యంగా రూపుదిద్దుకున్న ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహ ప్రయోగం నింగిలోకి దూసుకెళ్లింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తిరుపతి జిల్లా సతీష్‌ ధవన్‌స్పేస్‌ సెంటర్‌లోని(షార్‌) రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ57 ఉపగ్రహ వాహకనౌక ఆదిత్య-ఎల్‌1ను మోసుకెళ్లింది.

పీఎస్ఎల్వీ – సీ57 రాకెట్ ప్రయోగ నేపథ్యంలో శ్రీహరికోటలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. భూ, ఉపరితలం, సముద్ర తీరంలోనూ సీఐఎస్ఎఫ్ బలగాలు విస్తృత తనిఖీలు చేపట్టారు. షార్ పరిసర ప్రాంతాల్లో ఇతరులకు ప్రవేశాలు నిషేధించారు.ఇక ఈ ప్రయోగంలో సూర్యుడిపై పరిశోధనలకు 1,480.7 కిలోల బరువు కలిగిన ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపుతున్నారు. షార్‌ నుంచి చేసిన ప్రయోగాల్లో ఇది 92వది. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 59వది. భూమి నుంచి సూర్యుడి దిశగా దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజ్‌ పాయింట్‌ (ఎల్‌ 1) వద్దకు ఆదిత్య ఎల్‌ 1 ఉపగ్రహం చేరుకోనుంది. అక్కడికి చేరేందుకు ఈ మిషన్‌కు 125 రోజుల సమయం పడుతుంది.

ఆదిత్య-ఎల్‌1 నిర్దేశిత కక్ష్యలోకి చేరిన వెంటనే అందులో అమర్చిన విజిబుల్‌ లైన్‌ కొరోనాగ్రాఫ్‌(వీఈఎల్‌సీ) పేలోడ్‌ నిమిషానికి ఒకటి చొప్పున రోజుకు సుమారు 1,440 చిత్రాలను తీసి విశ్లేషణ కోసం గ్రౌండ్‌ స్టేషన్‌కు పంపుతుందని ప్రాజెక్టు సైంటిస్ట్‌ అండ్‌ ఆపరేషన్‌ మేనేజర్‌ డాక్టర్‌ ముత్తు ప్రియాల్‌ చెప్పారు. ఫిబ్రవరి చివరినాటికి మొదటి చిత్రం అందుతుందని భావిస్తున్నామన్నారు.

 

రాకెట్‌ వివరాలు
► పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌ పొడవు 44.4 మీటర్లు.
► రాకెట్‌ ప్రయోగ సమయంలో 321 టన్నుల బరువుంటుంది. నింగికి పయనమైన 01-03-31 (3799.52) నిమిషాల్లో ప్రయోగం పూర్తవుతుంది.
► మొదటి దశలో 139 టన్నుల ఘన ఇంధనం కోర్‌ అలోన్‌ దశ, ఈ ప్రయోగానికి రాకెట్‌ చుట్టూరా ఆరు స్ట్రాపాన్‌ బూస్టర్లు ఉంటాయి. ఒక్కో బూస్టర్‌లో 12.2 టన్నుల ఘన ఇంధనం నింపుతారు.
► 212.02 టన్నుల ఘన ఇంధనంతో మొదటి దశ 109.40 సెకన్లలో పూర్తవుతుంది.
► 41 టన్నుల ద్రవ ఇంధనాన్ని వినియోగించి 262.38 సెకన్లకు రెండోదశ పూర్తవుతుంది.
► 7.65 టన్నుల ఘన ఇంధనం సాయంతో 581.42 సెకన్లకు మూడో దశను పూర్తిచేస్తారు.
► మళ్లీ నాలుగోదశ (పీఎస్‌-4) 3127.52 సెకన్లకు స్టార్ట్‌ చేసి 3599.52 సెకన్లకు కటాఫ్‌ చేస్తారు.
► శిఖరభాగాన అమర్చిన ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహాన్ని 3799.52 సెకన్లకు (01.03.31 గంటల వ్యవధి)లో భూమికి దగ్గరగా (పెరిజి) 235 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజి) 19,500 కిలోమీటర్ల ఎత్తులోని ఎసింట్రక్‌ ఎర్త్‌ బౌండ్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు. 175 రోజుల తరువాత సూర్యుడి సమీపంలోని లాంగ్రేజియన్‌ బిందువు-1 వద్ద ప్రవేశపెట్టి సూర్యుడిపై అధ్యయనం చేస్తారు.