చాపకింద నీరులా అసమ్మతి నేతల చర్యలు
అధికారిక అభ్యర్థలను వెన్నాడుతున్న భయం
ఎన్నికల నాటికి మరింత తీవ్రం అవుతుందనే ఆందోళన
ఆదిలాబాద్,అక్టోబర్24(జనంసాక్షి): అనేకప్రాంతాల్లో టికెట్టు ఆశించి భంగపడ్డ నాయకులు అసమ్మతి రాగం ఆలపిస్తున్నారు. కొందరు పార్టీ మారారు. మరికొందరు ఇంకా అసమ్మతిని రగిలిస్తున్నారు. చెన్నూరులో సిట్టింగ్ అభ్యర్థి నల్లాల ఓదెలును కాదని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు సీటివ్వడంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఏకంగా నల్లాల ఓదెలు గృహనిర్బంధంలోకి వెళ్లిపోయి అధిష్టానానికి నిరసన తెలియజేశారు. ఓదెలు అభిమాని, ఎంమ్మార్పీఎస్ నాయకుడు గట్టయ్య ఆత్మాహుతికి ప్రయత్నించి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా కాలిన వారిలో మరో వ్యక్తి కూడా చనిపోయారు. అనంతరం
అధిష్టానం జోక్యంతో సుమన్ కోసం ఓదెలు ప్రచారం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి సుమన్‌కు షాకిచ్చి కాంగ్రెస్ పార్టీ వైపు దృష్టి సారించారు. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన వెలువడిన వెంటనే ఆయన ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మాజీ ఎమ్మెల్యే గడ్డం వినోద్ కూడా తనకు టికెట్టు ఇవ్వకపోవడంతో పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన సైతం కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమైనా కొన్ని కారణాలతో నిలిచిపోయింది. ఖానాపూర్‌లో సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ రమేష్ తిరుగుబాటు చేశారు. ఆయన కాంగ్రెస్‌లో చేరి, సిట్టింగ్ అభ్యర్థి రేఖానాయక్ ఓటమే లక్ష్యంగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. సిర్పూరులో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కోనేరు కోనప్పను ప్రకటించిన తరువాత మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య తిరుగుబావుటా ఎగరవేశారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌లో ఉన్న మండలాల నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. మంచిర్యాలలో ఎంపీపీ బేర సత్యనారాయణ బీఎస్పీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. నిర్మల్‌లో గత ఎన్నికల్లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విజయానికి తీవ్రంగా కృషి చేసిన మున్సిపల్ చైర్మన్ గణెళిష్ చక్రవర్తి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనతో పాటు 22 మంది కౌన్సిలర్లను కూడా కాంగ్రెస్‌లో కలిపేశారు. బోథ్‌లో అభ్యర్థి రాథోడ్ బాపూరావుకు వ్యతిరేకంగా ఎంపీ గోడం నగేష్ వర్గం పనిచేస్తోంది. ముథోల్‌లో కూడా అదే పరిస్థితి ఉంది. మాజీ ఎమ్మెల్యే సముద్రాల వేణుగోపాలాచారి వర్గం ముథోల్ అభ్యర్థి విఠల్‌రెడ్డితో కలిసి రావడం లేదు. ఆసిఫాబాద్‌లో కోవ లక్ష్మి, బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య, ఆదిలాబాద్‌లో మంత్రి జోగు రామన్నకు ప్రస్తుతానికి అసమ్మతి పోటు లేదు. ఎటు చూసినా అసమ్మతి కూడా అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. వీరంతా చాపకిందనీరులో వ్యతిరేకంగా పనిచేస్తారన్న భయం అభ్యర్థులను వెన్నాడుతోంది.