చారిత్రాత్మకంగా సుప్రీం తీర్పులు 

సుప్రీంకోర్టు అనేక కీలక తీర్పులను వెలువరించి 2019 సంవత్సరాన్ని గుర్తుంచుకునేలా చేసింది. అనేక కీలక అంశాల్లో చిటికెలో సమాధానం చెప్పేసింది. అయోధ్య,ఆర్టీఐ,రాఫెల్‌ డీల్‌ తదితర కేసుల్లో తీర్పు ఇచ్చింది. దీంతో ఇక ఈ అంశాలకు శాశ్వత తోవ చూపింది. శబరిమల కేసులో మాత్రం విస్తృత ధర్మాసనానికి నివేదించింది. మొత్తంగా చీఫ్‌ జస్టిస్‌గా ఈ నెల17న పదవీ విరమణ చేయబోతున్న జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ అనేక కీలక తీర్పులకు నేతృత్వం వహించారు. ఇలాగే సుప్రీంలో పెండింగ్‌లో ఉన్న వేలాది కేసులకు, దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో  ఉన్న కేసులకు మోక్షం లభిస్తే సామాన్యులకు ఊరట దక్కుతుంది. వరుసగా అయోధ్య,ఆర్టీఐ, రాఫెల్‌ తీర్పులు నిజంగానే చారిత్రక సన్నివేశంగా చూడాలి. భారత చరిత్రలో ఎంతో సున్నితమైన అయోధ్య విషయంలో సుప్రీం మెజార్టీ ప్రజల అభిమతాన్ని కాపాడింది. ఇకపోతే తాజా తీర్పుతో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై  క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సవిూక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాఫెల్‌ ఒప్పందంపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ అవసరంలేదని స్పష్టం చేసింది. 36 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు 2018 డిసెంబర్‌ 14న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. కాగా రాఫెల్‌ ఒప్పందంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీని ఉద్దేశించి ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అంటూ వ్యాఖ్యానించడం.. తన విమర్శను సుప్రీం తీర్పునకు ఆపాదించడంపైనా సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘చౌకీ దార్‌ చోర్‌’ వ్యాఖ్యలను రాహుల్‌ తమకు ఆపాదించడం దురదృష్టకరమనీ.. ఆయన భవిష్యత్‌లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలంటూ సూచించింది. ఈ కేసులో రాహుల్‌ గాంధీ పెట్టుకున్న క్షమాపణను అంగీకరించింది. ఆయనపై దాఖలైన పరువునష్టం కేసును కొట్టేసింది. కాగా రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందికి వస్తాయంటూ బీజేపీ నేత విూనాక్షి లేఖి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు ఓ రకంగా రాహుల్‌ గాంధీకి కూడా చెంపపెట్టు లాంటిదే. ఆయన విమర్శలుచేసే ముందు ఇక మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే శబరిమల విషయంలో ఎందుకనో కొంత వెనకడుగు వేసినట్లుగా కనిపిస్తోంది. మహిళలకు ఆలయప్రవేశం ఉండాలని గతేడాది తీర్పునిచ్చిన సుప్రీం దానిపై దాఖలైన పిటిషన్లపై విస్తృత ధర్మాసనానికి నివేదించింది. ఇక అన్నింటికి మించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సైతం ఆర్టీఐ పరిధిలోనికే వస్తుందని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం తీర్పునిచ్చింది. ఈ విషయంలో దాదాపు పదేళ్లక్రితం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైందేనంటూ సమర్థించింది. ఈ దేశంలో ఎంత శక్తిమంతులైనా, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నవారైనా రాజ్యాంగ చట్టం వారికంటే అత్యున్నతమైనదని అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు చాటిచెప్పింది. పారదర్శకతకు పట్టాభిషేకం చేస్తూ, తెలుసుకోవడం పౌరులకుండే తిరుగులేని హక్కని నిర్దారిస్తూ ఎన్నో సందర్భాల్లో తీర్పులు వెలువరించింది. తాజా తీర్పు ద్వారా ఇది తనకు కూడా వర్తిస్తుందని తెలియజేసి ఆ చట్ట పరిధిని విస్తృతం చేసింది. ఎవరికి వారు సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) తమకు వర్తించదంటూ భాష్యం చెప్పుకుంటున్న వేళ… ఇలాంటి తీర్పు చెంపపెట్టు లాంటిది. దీంతో అన్నా హజారే లాంటి వారి పోరాటానికి బలం వచ్చినట్లు అయ్యింది. లోకాయుక్త ద్వారా రాజకయీ నాయకులను ,ప్రధానిని తీసుకుని రావాలన్న పోరాటానికి సుప్రీం తీర్పు ఊతం కానుంది. ఆర్టీఐ  చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతున్న వేళ సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక నిర్ణయం
తీసుకుంది. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునివ్వడానికి దారితీసిన పరిణామాలను ఒక్కసారి గమనించాలి. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికీ, సుప్రీంకోర్టు కొలీజియానికీ మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాల సమాచారాన్ని ఇవ్వాలని,న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు అందజేయాలని ఆర్టీఐ కార్యకర్త సుభాష్‌ చంద్ర అగర్వాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఇదంతా మొదలైంది. అందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఆయన కేంద్ర సమాచార కమిషన్‌(సీఐసీ)ముందు పిటిషన్‌ వేశారు. అక్కడ ఆయనకు అనుకూలమైన నిర్ణయం వెలువడింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఢిల్లీ హైకోర్టులో సవాల్‌ చేసి అప్పట్లో అందరినీ విస్మయపరిచింది. అప్పట్లో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ఏపీ షా నేతృత్వంలోని ధర్మాసనం సుప్రీంకోర్టు వాదనను తోసిపుచ్చి సీఐసీ నిర్ణయాన్ని సమర్థించింది. న్యాయవ్యవస్థ స్వతంత్రత న్యాయమూర్తికుండే వ్యక్తిగత విశేషాధికారం కాదనీ, అది న్యాయమూర్తి గురుత బాధ్యతని ఆ సందర్భంగా తేల్చి చెప్పింది. దాంతో సుప్రీంకోర్టు రిజిస్టీ సుప్రీంకోర్టునే ఆశ్రయించింది. మొత్తంగా ఆర్టీఐ పరిధిలో మేము కూడా అంటూ ధర్మాసనం విలక్షణ తీర్పు ప్రకటించింది. సుప్రీం ధర్మాసనం వరుసపెట్టి ఇచ్చిన తీర్పులు భారతదేశ చరిత్రలో నిలిచిపోయేలా ఉన్నాయి. ఇందుకు చీఫ్‌ జస్టిస్‌గా రిటైర్ట్‌ అవ్వబోతున్న జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ చిరస్థాయిగా నిలిచి పోతారు. సామాన్యులకు సకాలంలో న్యాయం దక్కేలా కోర్టులు ముందుకు రావాల్సిన అవసరం గుర్తిస్తే మరింత మంచిది.

తాజావార్తలు