చింటూ లొంగుబాటు
చిత్తూరు, నవంబర్ 30 (జనంసాక్షి):
చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ హత్యకేసులో ప్రధాన నిందితుడు చింటూ సోమవారం చిత్తూరు కోర్టులో లొంగిపోయాడు. మేయర్ దంపతుల హత్య కేసులో పోలీసులు చింటూను ఏ1 నిందితుడిగా చేర్చారు. జంట హత్యల తర్వాత చింటూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు అప్పటి నుంచి చింటూ కోసం గాలిస్తున్నారు. అతడు దేశం వదిలి పారిపోకుండా దేశంలోని అన్ని విమానాశ్రయాలకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా కోర్టులో చింటూ లొంగిపోయాడు. గతంలోనే తాను లొంగిపోతానని చింటూ రాయబేరం పెట్టినట్లు వార్తలు వచ్చాయి. చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్‌ల హత్య కేసులో ప్రధాన నిందితుడుగా మోహన్ మేనల్లుడు చింటూ ఉన్నాడు. సోమవారం ఉదయం అతడు చిత్తూరు కోర్టులో నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి యుగంధర్ ఎదుట లొంగిపోయిన చింటూ న్యాయమూర్తికి పలు డాక్యుమెంట్లు అందజేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా కోర్టు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
చింటూకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. అనురాధ, ఆమె భర్త మోహన్ హత్యకు గురైనప్పటి నుంచి చింటూ అజ్ఞాతంలో ఉన్నాడు. ఆధారాలు పరిశీలించిన న్యాయస్థానం చింటూకు డిసెంబర్ 14 వరకు రిమాండ్ విధించింది. దీంతో చింటూ కడప కేంద్ర కారాగారానికి తరలించారు. మేయర్ హత్యకేసులో విచారణ నిమిత్తం చింటూను తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం అంగీకరించింది. చింటూను వారం రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో చింటూను కడప కేంద్ర కారాగారంలో హాజరు పరిచిన తర్వాత పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.అంతకుముందు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. పరందామ, హరిదాస్, కార్పొరేటర్ భర్త మురగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేసినవారి సంఖ్య ఎనిమిదికి చేరింది. మరో ఇద్దరు వెంకటేశ్, మొగిలికోసం కర్ణాటకలో పోలీసులు గాలిస్తున్నట్లు తెలిసింది. మేయర్, ఆమె భర్త హత్యకు ప్రధానంగా కుట్రను రచించాడని, హత్యకు కావాల్సిన ఆయుధాలను పంపిణీ చేశాడని ఇప్పటికే మురగ అనే వ్యక్తిపై తీవ్ర ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.అంతకుముందు పోలీసులు కోలార్‌కు చెందిన జీఎస్.వెంకటాచలపతి (51), చిత్తూరు జిల్లా గంగవరంకు చెందిన టి.మంజునాథ్ (27), చిత్తూరు నగరంలోని గంగనపల్లెకు చెందిన కె.జయప్రకాష్ (23)ను అరెస్టు చేశారు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ (38) ఇప్పటివరకు పరారీలోనే ఉండి చివరికి కోర్టులో లొంగిపోవడంతో ఇక ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగనుంది. అతడిని సబ్‌జైలుకు తరలించారు.