చిన్నారిని బలిగొన్న వర్ష బీభత్సం
గడ్డిఅన్నారం : మంగళవారం నాటి వర్ష బీభత్సం ఎనిమిదేళ్ల చిన్నారిని బలిగొంది. వర్షం, ఈదురు గాలుల ధాటికి తాటికి తటిచెట్టు కూలి స్తంభంపై పడడం మూడో తరగతి విద్యార్థిని పాలిట యమపాశంగా మారింది. దుకాణం నుంచి మరో రెండు నిమిషాల్లో ఇంటికి చేరుకునే సమయంలో ప్రమాదవశాత్తు తాటిచెట్టు చిన్నారిపై పడింది. తాటిచెట్టుతో పాటు దాన్ని ఆనుకొని ఉన్న విద్యుత్ స్తంభం కూడా కూలడంతో తీవ్రమైన గాయాలయ్యాయి. ఆస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ మారుతీనగర్‌లో మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది.
నల్లగొండ జిల్లా సూర్యపేటకు చెందిన శ్రీనివాస్, మంగ దంపతులు పది సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి న్యూ మారుతీనగర్ రోడ్డు నెం.12లో ఉంటున్నారు. శ్రీనివాస్ ఇస్త్రీ చేస్తుండగా, మంగ ఇళ్లలో పనిచేస్తోంది. వీరి కుమార్తె రేణుశ్రీ (8) స్థానికంగా ఉన్న జనప్రియ పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన రేణుశ్రీ వర్షం తగ్గిన తరువాత ఇంటి సమీపంలో ఉన్న దుకాణానికి వెళ్లింది. తిరిగి ఇంటికి వస్తుండగా సమీపంలో ఉన్న తాటిచెట్టు ఒక్కసారిగి కూలి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభంపై పడింది. చెట్టుతోపాటు విద్యుత్ తీగలు కూడా రేణుశ్రీపై పడ్డాయి. తీవ్రమైన గాయాలవడంతో కొత్తపేటలోని ఓమ్ని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రేణుశ్రీ మృతి చెందింది.
తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు
శ్రీను, మంగ దంపతులకు రేణుశ్రీ ఒక్కతే సంతానం. రేణుశ్రీ చదువులో చాలా మెరుగ్గా రాణిస్తుంది. ఇటీవల పాఠశలలో నిర్వహించిన డ్యాన్స్ పోటీల్లో ఆమెకు పాఠశాల వారు రూ. 5వేల ప్రోత్సాహక బహుమతి ఇచ్చారు. ఉన్న ఒక్కగానొక్క బిడ్డ మృతి చెందడంతో తమెవరికోసం బతకాలంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా ఏడుస్తుండడం చూసి ఆస్పత్రికి వచ్చిన వారు కంటతడిపెట్టారు.