చిన్నారిని మింగిన బోరుబావి

3

భోపాల్‌,జులై 23(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌ పట్టణంలోని ఓ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బోరు బావిలో పడ్డ రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం పొలం నుంచి తన నానమ్మతో కలిసి అభయ్‌ పచౌరి(2) ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిపోయాడు. దీంతో అభయ్‌ నానమ్మ బాలుడిని రక్షించాలంటూ గట్టిగా కేకలు వేసింది. ఘటనాస్థలికి చేరుకున్న స్థానికులు, అధికారులు బోరు బావి చుట్టూ గుంత తవ్వారు. బాలుడిని రక్షించేందుకు సుమారు 20 గంటల పాటు అధికారులు, పోలీసులు శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బాలుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. 200 ఫీట్ల లోతు బోరు బావిలో పడ్డ బాలుడు 30 ఫీట్ల వద్ద ఇరుక్కపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే 30 ఫీట్ల వద్ద పాము ఉన్నట్లు సీసీ టీవీ కెమెరా ద్వారా అధికారులు గుర్తించారు. బాలుడిని పాము కాటు వేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.