చిన్నారి ప్రాణాన్ని బలిగొన్న డ్రైనేజీ
మురుగుకాల్వలో పడి మూడేళ్ల బాలుడు మృతి
ఓగీసుపేటలో విషాధ ఘటన
మచిలీపట్నం, జూన్7(జనం సాక్షి) : బందరులో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ ఓ చిన్నారి ప్రాణాన్ని చిదిమేసింది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పట్టణంలో మురికి కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఓగీసుపేటలోని మురుగు కాల్వలో పడి మూడేళ్ళ బాలుడు ప్రమాదవశాత్తూ పడి మృతిచెందాడు. డ్రైన్‌లో కొట్టుకుపోతున్న బాలుడి మృతదేహాన్ని ఓగీసుపేటకు చెందిన యువకులు చూసి బయటకు తీసి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడిని స్థానిక వెండి వ్యాపారస్తుడు ఖాజా తనయుడు అంజత్ ఖాన్‌గా గుర్తించారు. ఈ ఘటనతో కొత్తమసీదు సెంటర్లో విషాదఛాయలు అలముకున్నాయి. అధికారులు బీచ్ ఫెస్టివల్ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండటంతో హుటాహుటిన అక్కడికి చేరుకోలేకపోయారు. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులకు బాధిత కుటుంబాన్ని పరామర్శించే తీరిక వారికి లేదా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, కుటుంబీకుల రోధనలు మిన్నంటాయి. అధికారుల నిర్లక్ష్యం వైఖరిగానే చిన్నారి ప్రాణం బలైందని కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చలేక పోయారని, ఫలితంగా చిన్నపాటి వర్షానికే కాల్వలు నిండి ప్రవహిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.