చివరి ధాన్యం గింజ వరకు.. కొనుగోలు చేస్తాం
– అకాలవర్షంతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
– రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీష్‌రావు
– సిద్దిపేటలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి
సిద్ధిపేట, మే4(జనం సాక్షి ) : సిద్ధిపేట మార్కెట్‌యార్డులో తడిసిన ధాన్యాన్ని నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు శక్రవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు విూడియాతో మాట్లాడారు. రైతుల నుంచి చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి చాలా ఆస్తి, పంట, ప్రాణ నష్టం జరిగిందన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు కొనేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చామని చెప్పారు. తడిసిన ధాన్యం కొనుగోళ్లపై రైతులకు భరోసా కల్పించాలని అధికారులను ఆదేశించామన్నారు. ధాన్యం కొనగానే వెంటనే తరలించాలని రవాణా అధికారులకు, కలెక్టర్లకు సూచించామని మంత్రి పేర్కొన్నారు. సిద్ధిపేటలో ఇప్పటి వరకు 16,211 క్వింటాళ్ల వరి ధాన్యం కొన్నామని గుర్తు చేశారు. 11,511 క్వింటాళ్ల మక్కలు, 2600 క్వింటాళ్ల పొద్దు తిరుగుడు కొన్నామని తెలిపారు. జిల్లాలో అందుబాటులో ఉన్న 10 వేల టార్ఫాలిన్లను రైతులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ నెల 9న మెదక్‌లో కలెక్టరేట్ నిర్మాణానికి సీఎం కేసీఆర్
శంకుస్థాపన చేస్తారని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. ఇదిలావుంటే జిల్లాలో గురువారం ఈదురుగాలులతో కూడిన అకాలవర్షం అతలాకుతలం చేసింది. ముఖ్యంగా అన్నదాతలకు ఖేదం కల్గింది. పలు చోట్ల వరి పంట దెబ్బతినగా… కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్ల పేరిట అధికారులు హడావిడి చేసినా సరిపడా టార్పాలిన్లు అందుబాటులో ఉంచడంలో విఫలమయ్యారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట మార్కెట్ యార్డులో కొనుగోలు చేసిన దాదాపు 1200 క్వింటాళ్ల ధాన్యం బస్తాలు పాక్షికంగా తడిశాయి. దుబ్బాక మార్కెట్ యార్డులోనే ఇదే స్థితి. నీటి ప్రవాహంలో ధాన్యం కొట్టుకుపోవడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమైంది. హుస్నాబాద్ యార్డులో దాదాపు ఐదు వేల బస్తాల ధాన్యం, మూడు వేల బస్తాల మొక్కజొన్న నీటిపాలైంది. మిరుదొడ్డి మండలంలోని ఎనిమిది కొనుగోలు కేంద్రాల్లో దాదాపు రెండు వేల క్వింటాళ్లు తడిసింది.