చురుకుగా హరితహారం కార్యక్రమం

మెదక్‌,జూలై28(జ‌నం సాక్షి): హరితహారం కార్యక్రమంలో భాగంగా 27.4లక్షల మొక్కలు నాటడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి తెలిపారు. మిగతా లక్ష్యాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని వివరించారు. రైతుబంధు, రైతు బీమాలో చెక్కుల పొందిన రైతుల వివరాలు నిర్దేశిత సమయంలో నమోదు చేస్తామని, జిల్లాలో ఇప్పటివరకు 74శాతం రైతుల వివరాలు నమోదు చేసినట్లు తెలిపారు. భూరికార్డుల ప్రక్షాళనలో డిజిటల్‌ సంతకాలు వేగవంతం చేసి కొత్త పాస్‌పుస్తకాల ముద్రణ పూర్తి చేస్తామన్నారు.ఆగష్టు 15న ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల భీమా సర్టిపికెట్లు అందివ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. గ్రామసభల ద్వారా రైతులకు బీమా సర్టిపికెట్లు అందించాలన్నారు. రైతులకు బిందుసేద్యం పథకం వేగవంతం చేయాలని ఈసందర్భంగా సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబీమా పథకంలో ప్రతి ఒక్కరూ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. రైతుబంధు చెక్కులు పొందిన రైతులందరిని బీమా పథకంలో చేర్చాలని సూచించారు. ఈ బీమా పథకంలో చేరడానికి ఇష్టం చూపని వివరాలు సైతం నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో ఇంకా మిగిలిన పాస్‌పుస్తకాల డిజిటల్‌ సంతకాలను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.