చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌
నల్లగొండ,మే8(జ‌నం సాక్షి): రైతుబంధు పథకం కింద రైతులకు అందిస్తున్న చెక్కులకు నగదు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ తెలిపారు. గ్రామంలో ప్రచారం నిర్వహిస్తామని, ప్రతి రోజు ఎంత నగదు పంపిణీ చేసారో రిపోర్టు చేయాలని తెలిపారు. అలాగే ముందే ప్రచారం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 10 నుంచి రైతులకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుబంధు పథకం కింద ప్రతి ఎకరాకు రూ. 4 వేల చొప్పున, 4 లక్షల 44 వేల చెక్కులు 31 మండలాల్లో రైతులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఆంధ్రాబ్యాంకు, ఏపీజీవీబీ, కెనరా బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకు, ఎస్‌బీఐ, సిండికేట్‌ బ్యాంకుతో మొత్తం 6 బ్యాంకులు, 43 బ్రాంచ్‌లు ఈ పక్రియలో పాలు పంచుకోనున్నాయన్నారు. అవసరమైతే బ్యాంకు బ్రాంచ్‌ల సంఖ్య పెంచుతామన్నారు. బ్యాంకులు నగదు కొరత లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. బ్యాంకుల్లో నగదు ఉండేలా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటుందన్నారు. రైతు పట్టాదార్‌ పాస్‌పుస్తకం, ఆధార్‌, గుర్తింపుకార్డు రెండింటిలో ఒకటి చూపిస్తే నగదు జారీ చేయాలన్నారు. గ్రామ వారి పంపిణీ షెడ్యూల్‌ రూపొంది బ్యాంకర్లకు అందజేస్తామని తెలిపారు. మండల సమావేశాలు నిర్వహించి బ్యాంకర్లు తహసీల్దార్లతో చర్చించాలని ఆయన సూచించారు. బ్యాంకర్లు నగదు జారీ చేసిన వాటికి సక్రమంగా రికార్డులు నిర్వహించాలన్నారు. బ్యాంకుల వద్ద రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, షామియానాల ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు చెక్కులు, పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు పంపిణీ చేసేందుకు రైతుపేరు, ఖాతా నెంబర్‌, ఎప్పుడు పంపిణీ, ఎప్పుడు క్యాష్‌ చేసుకోవాలో వంటి వివరాలతో టోకెన్‌ ఇవ్వనున్నామన్నారు. ప్రతి బ్యాంకు దగ్గర పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలో 400 కోట్ల మేర పంపిణీ చేయనున్నందున ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  వ్యవసాయ, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో కలిపి చెక్కుల పంపిణీకి మండలాల్లో బృందాలు ఏర్పాటు చేసామన్నారు. గ్రామ వారీ ఖాతాలు, చెక్కుల వివరాలు అందిస్తామన్నారు. అవసరమైతే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. బ్యాంకులో ముందు రోజే ఎంత క్యాష్‌ ఉండాలనేది ఏర్పాటు చేసుకోవాలన్నారు.
—–