చెత్తగా ఓ(ఆ)డారు

తడబడిన ధోని సేన           165 పరుగులకే ఆలౌట్‌
85 పరుగులతో పాక్‌ విజయం 2-0తో సిరీస్‌ పాక్‌ వశం

కోల్‌కతా, జనవరి3: షరా మామూలే..! టీమిండియా ప్రదర్శన గురించి చెప్పడానికి అంతకంటే చెప్పుకోవడానికి ఏమీలేదు. ఎవరి చేతిలో ఓడితో భారత అభిమానులంతా సంతోషిస్తారో వారిపైనే ఓడింది. చిరకాల ప్రత్యర్థిపై ఓడి ఛీ..అనిపించుకొంది. గత కొంత కాలంగా ఓడిపోవడం అలవాటు చేసుకున్న ధోని సేన ఇక్కడ అదే చేసింది. గ్రౌండ్‌లో ఉండడం కంటే పెవిలియన్‌లో ఉండడానికే ఎక్కువగా ఇష్టపడ్డారు. వచ్చిన వారు వచ్చినట్లు పెవిలియన్‌ బాట పట్టారు. తమకేదో అర్జెంట్‌ పని ఉందన్నట్లుగా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. పాక్‌ను 300 పరుగులలోపే ఆలవుట్‌ చేసి సంబరపడ్డ భారత్‌ 165 పరుగులకే చాపచుట్టేసింది. గత రికార్డులన్నీ పాక్‌కే అనుకూలమని చెప్పినా ధోని సేనపై కాస్తో కూస్తో ఉన్న నమ్మకాన్ని టీమిండియా పోగొట్టుకుంది. గురువారం ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌  తమ ముందు ఉంచిన 251 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌ చేతులెత్తేసింది. 85 పరుగుల తేడాతో పాక్‌ భారత్‌ను మట్టి కరిపించి ఓ వన్డే మ్యాచ్‌ మిగిలి ఉండగానే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకుంది. పాక్‌ బౌలర్ల ముందు భారత్‌ బ్యాట్స్‌మెన్‌ తేలిపోయారు. భారత్‌ 48 ఓవర్లలోనే 165 పరుగుల మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది. ధోని 54 పరుగుల చేసి నాటౌట్‌గా నిలిచాడు. పాక్‌ బౌలర్లలో సయీద్‌ అజ్మల్‌, జునైద్‌ఖాన్‌ మూడేసి వికెట్లు తీసుకోగా, ఉమర్‌గుల్‌ రెండు వికెట్లు, హఫీజ్‌ ఒక వికెట్‌ తీసుకున్నారు. గంభీర్‌ 25 బంతుల్లో 11 పరుగులు చేసి జునైద్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. 42 పరుగుల స్కోర్‌ వద్ద భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. విరాట్‌ కోహ్లీ చేతులెత్తేశాడు. కేవలం ఆరు పరగులు చేసి జునైద్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో భారత్‌ 55 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత సెహ్వాగ్‌ 59 పరుగుల వద్ద వీరేంద్ర సెహ్వాగ్‌ 31 పరుగులు చేసే ఉమర్‌ గుల్‌ బౌలింగ్‌లో మూడో వికెట్‌గా పెలిలిరయన్‌ మళ్లాడు. భారత బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టినట్లే కనిపిస్నుతన్నారు. యువరాజ్‌ సింగ్‌ 19 బంతులు ఆడి 9 పరుగులు చేసిన ఉమర్‌ గుల్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరుకున్నాడు. దీంతో 70 పరుగుల వద్ద భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయిం ది. వంద పరుగులు కూడా చేయకుండానే భారత్‌ ఐదు వికెట్లను కోల్పోయింది. 95 పరుగుల వద్ద ఐదో వికెట్‌గా సురేష్‌ రైనా అవుటయ్యాడు. రైనా 42 బంతులు ఆడి కేవలం 18 పరుగులు చేసి మొహమ్మద్‌ హఫీజ్‌ బౌలింగులో అవుటయ్యాడు. 103 పరుగుల వద్ద భారత్‌ ఆరో వికెట్‌ కోల్పో యింది. అశ్విన్‌ 3 పరుగులు చేసే అవుటయ్యాడు. అంతకు ముందు స్కోరు వేగం పెంచే క్రమంలో పాకిస్తాన్‌ బ్యాట్స్‌మెన్‌ చివరలో పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్లు అందించిన ప్రారంభాన్ని మిడిల్‌ ఆర్డర్‌ కొనసాగించలేకపోయింది. యాభై ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్‌ స్కోరు 300 పరుగులు దాటుతుందని భావించిన తరుణంలో ఒక్కొక్క వికెట్‌నే పాకిస్తాన్‌ జారవిడుచుకుంటూ వచ్చింది. చివరలో భారత బౌలర్లు విజృంభించి, పాకిస్తాన్‌ను పూర్తిగా కట్టడి చేశారు. రవీంద్ర జడేజా మరోసారి తన సత్తా చాటాడు. మూడు ముఖ్యమైన వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్‌ను 250 పరుగులలకు భారత్‌ కట్టడి చేసింది. పూర్తి ఓవర్లను కూడా పాకిస్తాన్‌ ఆడలేకపోయింది. 48.3 ఓవర్లు మాత్రమే ఆడింది. పాకిస్తాన్‌ 34.3 ఓవర్లలో 177 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌ మొహమ్మద్‌ హఫీజ్‌ను 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా అవుట్‌ చేయడంతో ప్రారంభమైన వికెట్లు పతనం చివరి వరకు కొనసాగుతూ వచ్చింది. అజర్‌ అలీ రన్నవుట్‌ కాగా, యూనిస్‌ ఖాన్‌ను 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రైనా పెవిలియన్‌కు పంపించాడు. 182 పరుగుల వద్ద పాకిస్తాన్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. అశ్విన్‌ చేతిలో మిస్బావుల్‌ హక్‌ రెండు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఓ వైపు వికెట్లు పడిపోతుంటే జంషెడ్‌ గట్టిగా నిలబడి సెంచరీ చేశాడు. 124 బంతుల్లో 106 పరుగులు చేసి అతను జడేజా బౌలింగులో అవుటయ్యాడు. ఆ వెంటనే కమ్రాన్‌ అక్మల్‌ జడేజా చేతిలోనే డకౌట్‌ అయ్యాడు. 210 పరుగుల వద్ద ఆరో వికెట్‌ పాకిస్తాన్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇషాంత్‌ శర్మ బౌలింగులో షోయబ్‌ మాలిక్‌ 24 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో 23 పరుగుల వద్ద పాకిస్తాన్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. 249 పరుగుల వద్ద అజ్మల్‌ (7) రూపంలో ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత ఒక్క పరుగుకే రెండు వికెట్లను పాకిస్తాన్‌ కోల్పోయింది. ఇషాంత్‌ శర్మకు కూడా మూడు వికెట్లు లభించాయి. పాకిస్తాన్‌పై కోల్‌కతాలోని ఆడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచులో భారత క్రికెట్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. మొదటి వన్డేలో పాకిస్తాన్‌ ఐదు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత్‌ తది జట్టులో ఓ మార్పు చేసింది. ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న రోహిత్‌ శర్మ స్థానంలో రవీంద్ర జడేజా తుది జట్టులోకి వచ్చాడు. ఏ విధమైన మార్పులు లేకుండానే పాకిస్తాన్‌ జట్టు బరిలోకి దిగింది. ఈడెన్‌ గార్డెన్స్‌లో 1987 నుంచి భారత్‌ పాకిస్తాన్‌ను గత మూడు వన్డేల్లోనూ ఓడించలేకపోయింది.

స్కోరుబోర్డు :

పాక్‌ ఇన్నింగ్స్‌ 250 (ఆలౌట్‌ 48.3) (జంషెడ్‌ 106, హఫీజ్‌ 76)

భారత్‌ ఇన్నింగ్స్‌ 165(ఆలౌట్‌ 48)  (సెహ్వాగ్‌ 31, ధోని నాటౌట్‌ 54)