చెదురుమదురు ఘటనల మినహా..

చెదురుమదురు ఘటనల మినహా..

హైదరాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి):

రాష్ట్రంలోని 18 శాసనసభా స్థానాలతోపాటు నెల్లూరు లోకసభ స్థానానికి
జరిగిన ఉప ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. నెల్లూరు లోకసభ నియోజకవర్గంలో 68శాతం పోలింగ్‌ జరిగింది. రాయదుర్గంలో  అత్యధికంగా 88శాతం పోలింగ్‌ కాగా, తిరుపతిలో అత్యల్పంగా 55శాతం పోలింగ్‌ జరిగింది. నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ శాతం ఇలా ఉంది. పరకాల, మాచర్ల, రామచంద్రాపూర్‌ నియోజకవర్గాల్లో 84శాతం,  పాయకారావుపేట, నర్సాపురంలో 86 , పత్తిపాడు, రాయచోటి, పోలవరం నియోజకవర్గాల్లో 80శాతం, ఆళ్లగడ్డలో 78.69శాతం, ఎమ్మిగనూరులో 76.97శాతం, నరసన్నపేటలో 75శాతం, ఉదయగిరిలో 72శాతం, రైల్వే కోడూరులో 69శాతం, రాజంపేటలో 68శాతం, అనంతపురంలో 66శాతం, ఒంగోలులో
65శాతం పోలింగ్‌ జరిగింది.చెదురుమదురు ఘటనలు మినహా..
గుండెపోటుతో…
నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలోని మర్రిపాడు మండలం బొంగరుకండ్రిగలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన ఒక వృద్ధురాలు గుండెపోటుతో మరణించింది.
అధికారుల తొలగింపు..
ఒంగోలులోని పీవీఆర్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 60వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్‌ అధికారిని, మైక్రో అబ్జర్వర్‌లను విధుల నుంచి తొలగించారు. పోలింగ్‌కు వచ్చిన ఓటర్లను ప్రలోభపెడుతున్నట్టు  వెబ్‌ కెమేరాలో పట్టుబడటంతో వారిని తొలగిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి బన్వర్‌లాల్‌ తెలిపారు.
కృష్ణదాస్‌ ఓటింగ్‌పై…
నర్సన్నపేటలో ధర్మాన కృష్ణదాస్‌ పోలింగ్‌ ప్రారంభ సమయాని కంటే పది నిమిషాల ముందు ఓటు వేశారని  ఫిర్యాదు అందడంతో నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను కోరినట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి బన్వర్‌లాల్‌ తెలిపారు.
గల్లంతైన ఓట్లు, స్లిప్‌లు అందని సంఘటనలపై ఫిర్యాదులు అందాయని ఈ సమయంలో ఏమీ చేయలేమని ఓటర్లు ఈ విషయాలపై ముందుగానే జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సి ఉందని బన్వర్‌లాల్‌ చెప్పారు.
విశేషాంశాలు…
– రామచంద్రాపురంలో కోలంకలో ఈవీఎం మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభం.
– రామచంద్రాపురంలోని వెంకటాయ పాలెంలో కాంగ్రెస్‌ అభ్యర్థి త్రిమూర్తులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
– రామచంద్రాపురంలోని హసనాబాద్‌లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
– నర్సాపురంలో కొత్తాటలో ఓటరుపై చేయి చేసుకున్న సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌.
– నర్సన్నపేట, పాయకరావుపేటలలో 11 గంటల వరకు పోలింగ్‌ మందకొడిగా సాగింది.
– గుంటూరు లాల్‌పురంలో పోలీసులకు, ఏజెంట్లకు మధ్య వాగ్వాదం.
– నెల్లూరు అర్బన్‌ పోలింగ్‌ కేంద్రం 106, 107లలో ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతు. చనిపోయిన వ్యక్తి పేర ఓటు  నమోదు కావడం చర్చనీయాంశమైంది.
–  రాయదుర్గంలో మోరంపల్లిలో ఈవీఎం మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభం.
– కందుకూరులోని ఒకటో నెంబర్‌ వార్డులో పోలింగ్‌ను బహిష్కరించిన గిరిజనులు. శ్మశానానికి స్థలం కేటాయించనందుకు నిరసనగా బహిష్కరిస్తున్నట్టు పేర్కొన్నారు.
– ఆళ్లగడ్డ గోయెందిన్నెలో స్వల్ప ఉద్రిక్తత.
– తిరుమలలోని రెండో నంబర్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓట్లు గల్లంతు.
– అనంతపురంలోని రాణినగర్‌లో పోలింగ్‌ కేంద్రంలో ఓట్లు గల్లంతు. పట్టించుకోని అధికారులు.
– లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే రమేశ్‌రెడ్డి గృహ నిర్బంధం. రిగ్గింగ్‌కు పాల్పడే అవకాశం ఉన్నదన్న వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు.
– తిరుపతి బాలాజీ కాలనీలో డమ్మీ ఈవీఎం పట్టివేత.
– పరకాల ఆత్మకూరు మండలం పునుగుర్తిలో లాఠీచార్జి.
– నెల్లూరులోని కొడవలూరు మండలం ఎల్లాయపాలెం 133, 134 బూత్‌లలో మొరాయించిన ఈవీఎంలు.
– నెల్లూరులోని కొడవలూరు మండలం రాచర్లలో పోలింగ్‌ బహిష్కరణ. పరిశ్రమ ఏర్పాటు చేస్తామని భూములు తీసుకుని నేటికీ ఏర్పాటు చేయలేదని, తిరిగి తమ భూములు ఇచ్చి వేయాలని కోరుతున్నామన్నారు. సుమారుగా 526 మంది పోలింగ్‌ను బహిష్కరించినట్టు తెలిసింది.
– ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రిలో ఆరు పోలింగ్‌ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించాయి.   ఈ  ఈవీఎంలను సరిచేసేందుకు గంట సమయం పట్టింది.   అలాగే సిరివెళ్ల గ్రామంలో 50 మంది ఓటర్ల పేర్లు గల్లంతు అయ్యాయి. వీరు గుర్తింపు కార్డులు తీసుకువెళ్లినప్పటికీ లిస్టులో పేర్లు లేకపోవడంతో వారు నిరాశతో వెనుదిరిగారు.
– రైల్వేకోడూరు నియోజకవర్గంలోని జంగిటివారిపల్లిలో వైఎస్సార్‌ సీపీ, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న వివాదం నేపథ్యంలో లాఠీచార్జి చోటుచేసుకుంది.

తాజావార్తలు