చెన్నై థ్రిల్లింగ్ విక్టరీ
చెన్నై :చెన్నైలో శనివారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌పై చెన్నై సూపర్‌కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఓపెనర్స్ బ్యాట్స్‌మెన్ గేల్ 10 బంతుల్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మోరీస్ బౌలింగ్‌లో ధోనికి క్యాచ్ ఇచ్చిన వెనుదిరిగాడు. అగర్వాల్ 21 బంతుల్లో 24 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ 47 బంతులు ఆడి 58 (2 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులు చేసి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. విల్లర్స్ రావడంతోనే దూకుడుగా ఆడాడు. 32 బంతుల్లో 64 (8 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేశాడు. నాన్నేస్ బౌలింగ్‌లో బ్రావోకు క్యాచ్ ఇచ్చాడు. అలాగే క్రిస్టియన్ 2, అరుణ్ కార్తీక్ ఐదు పరుగులు చేయగా.. రామ్‌పాల్ డకౌట్ అయ్యాడు. చెన్నై జట్టులో మోర్రిస్ 3 వికెట్లు పడగొట్టగా నాన్నేస్, అశ్విన్. బ్రావో ఒక్కో వికెట్ తీశారు. తర్వాత 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ కింగ్స్ 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి గెలుపొందింది. చెన్నై బ్యాట్స్‌మెన్‌లలో సురేశ్‌రైనా (30), బద్రీనాథ్ (34), ధోని (33), రవీంద్ర జడేజా (38 నాటౌట్) రాణించారు. రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లలో రాంపాల్ 3, మహమూద్ 2, వినయ్‌కుమార్ ఒక వికెట్ తీశారు. చివరి ఓవర్లలో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. చెన్నై ఒక బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా ఆర్పీసింగ్ విసిరిన బంతికి రవీంద్ర జడేజా భారీషాట్ కొట్టాడు. బౌండరీలైన్ వద్ద ఫీల్డర్ క్యాచ్ పట్టాడు. దీంతో బెంగళూరు జట్టు ఆటగాళ్లు సంబరాల్లో మునిగితేలుతుండగా ఎంపైర్ షాకిచ్చాడు. ఆర్పీ సింగ్ వేసిన బంతిని నోబాల్‌గా ప్రకటించాడు. అప్పటికే బ్యాట్స్‌మెన్లు ఒక రన్ తీయగా.. నోబాల్‌కు మరో పరుగు అదనంగా వచ్చింది. దీంతో ఒక బంతి మిగిలిఉండగానే విజయం సాధించారు.